ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాల్లో అన్యాయం
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాల్లో అన్యాయం
- రాయితీకి నోచుకోని లబ్ధిదారులు
- లక్ష్యం పూర్తికి గడువు 30 రోజులే
- అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రభుత్వ విధానాలు నిరుద్యోగులకు శాపమవుతున్నాయి. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి రుణాలిస్తామంటూ ఆశలు కల్పించి ఉసూరు మనిపించే దుస్థితి నెలకొంటోంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందు రుణాల రాయితీని సర్కారు ప్రకటించింది. సమయం తక్కువగా ఉండడం.. బ్యాంకర్ల నిబంధనలు వంటి కారణాలతో లబ్ధిదారులకు రుణాలతో పాటు రాయితీ దక్కే అవకాశం లేకుండా పోయింది. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోడానికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. బీసీ, ఎస్సీ, మైనార్టీ, వికలాంగ, సెట్విస్ శాఖలకు సంబంధించి 8,785 యూనిట్లకు ఇప్పటి వరకు కేవలం 2,034 మందికి మాత్రమే రుణాలను మంజూరు చేశారు. వికలాంగులకు ఒక్కరికి కూడా రుణం ఇవ్వకపోవడం గమనార్హం.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: వాస్తవానికి ఏటా ఏప్రిల్, మే నెలలోఎస్సీ, ఎస్టీ, బీసీల రుణాలకు యూనిట్ల మంజూరు, నిధుల లక్ష్యం నిర్దేశించి మూడు నెలల్లో మంజూరు చేస్తుంటారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం రాయితీని ప్రకటించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేసింది. గతేడాది డిసెంబర్ వరకు ఎస్సీ, ఎస్టీలకు రుణ లక్ష్యాన్ని కూడా నిర్దేశించలేదు. వారికిచ్చే రుణాల రాయితీపై కూడా ఓ నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి 3 నెలల ముందు అంటే డిసెంబర్ 31న ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాలపై రూ.లక్ష వరకు రాయితీని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాటిల్లోనూ పూర్తి స్థాయిలో స్పష్టత రాడానికి మరో రెండు వారాలు పట్టింది. దీందో ఆయా శాఖల అధికారులు జనవరి మూడో వారం నుంచి లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. లక్ష్యాలను చేరుకోడానికి జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు రెండేసి మండలాల్లో పర్యటించి అవగాహన కార్యక్రమాలతో పాటు లబ్ధిదారుల గుర్తింపును చేపట్టారు. సమయం తక్కువగా ఉండడంతో ఇప్పటి వరకు కేవలం 25 శాతమే పూర్తి చేయగలిగారు. నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈలోగా పదుల సంఖ్యలో లబ్ధిదారులకు మాత్రమే మేలు జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
మహిళల ఆర్థిక స్వావలంభనకు
మహిళల ఆర్థిక స్వావలంభన కోసం ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాల మంజూరుకు అధికారులు చర్యలు చేపట్టారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, స్క్రీన్‌ప్రింటింగ్, ఇలా అన్ని స్వయం ఉపాధి పనులకు రుణాలివ్వనున్నారు. ఈ పథకం కింద జిల్లాలో 200 మంది మహిళా లబ్ధిదారులను గుర్తించాలని అధికారులు నిర్ధేశించుకున్నారు. భర్తను కోల్పోయి, నిరాశ్రయులు, సాంఘిక అరాచకాలకు గురైన, ఎయిడ్స్ బాధిత, పెదరికంలో ఉన్న మహిళలకు ఈ పథకం ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. ఒక్కో మండలంలో ఐదుగురు మహిళలకు రాయితీ రుణాలు మంజూరు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
బ్యాంకర్ల దయతోనే..
ఏదైనా వ్యాపారం చేయాలన్న తపన ఉన్నా.. లబ్ధిదారులుగా అధికారులు గుర్తించినా.. రుణం మంజూరు కావాలంటే బ్యాంకర్ల మీదే ఆధారపడాలి. తక్కువ సమయంతో లబ్ధిదారులను గుర్తిస్తున్నా.. రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రికవరీలను దృష్ట్యా పూర్తి విశ్వాసం కలిగితేనే రుణమిచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ కారణం వల్ల కూడా కొంత జాప్యం జరుగుతోంది.