
తొలి లోక్‌సభ సభ్యుని వానప్రస్థం!
న్యూఢిల్లీ: ఆయనది ఏడు దశాబ్దాల రాజకీయ జీవితం. స్వాతంత్య్రానంతరం 1952లో కొలువుదీరిన తొట్టతొలి లోక్‌సభకు ఎంపికై, ఇప్పుడు కూడా పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్న అరుదైన రికార్డు ఆయన సొంతం. అంతేనా... నెహ్రూ మొదలుకుని, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ... ఇలా ఆ కుటుంబంలోని అన్ని తరాల నేతలతోనూ కలిసి పని చేసిన ఘనత ఆయనది. ఆయనే రాజ్యసభ సభ్యుడు రిషాంగ్ కీషింగ్ (95).
ప్రస్తుత పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో అత్యంత వృద్ధుడు కూడా అయిన కీషింగ్, రాజకీయాల నుంచి ఇక రిటైరవనున్నట్టు తాజాగా ప్రకటించారు. దేశ రాజకీయాల్లో చాలా ఉత్థాన పతనాలను చూశానని, ఇక తప్పుకోవాలని అనుకుంటున్నానని అన్నారు. రిటైరయ్యాక తోట పనికి సమయం కేటాయించాలనుకుంటున్నారట! ఆయన రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై 1952లో లోక్‌సభకు ఎన్నికైన కీషింగ్, నెహ్రూ ఆహ్వానం మేరకు 1962లో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఆయన మణిపూర్ సీఎంగా కూడా పనిచేశారు.