
సాక్షి, చెన్నై: భారీ వర్షాలు చెన్నైని ముంచెత్తాయి. కుంభవృష్టితో నగర వీధులు జలమయమయ్యాయి. వర్షాల తీవ్రతతో పాటు చెన్నై విమానాశ్రయాన్ని మేఘాలు కమ్మేయడంతో ఆదివారం ఉదయం 9 అంతర్జాతీయ విమానాలతో పాటు 14 ఫ్లైట్లను దారిమళ్లించారు. మరికొన్ని విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది. చెన్నై నగరంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 25.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలతో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3.50 గంటల వరకు చెన్నైకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. లండన్, అబుదాబి నుంచి చెన్నై రావాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలను హైదరాబాద్‌కు మళ్లించినట్టు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. అయితే ఉదయం ఆరు గంటల తర్వాత విమాన రాకపోకలు యథాతథంగా సాగాయని వెల్లడించాయి.