
ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: ‘‘ఆర్థికాభివృద్ధికి మౌలిక రంగమే చోదకశక్తి. ఈ రంగంలో భారీగా పెట్టుబడులకు అవకాశం ఉంది. రూ. 50 లక్షల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తే జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుంది. తద్వారా రోడ్లు, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వేలు, భూగర్భ జలాలు మెరుగుపడి ప్రజ లకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం లభిస్తుంది’’అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఈసారి సాధారణ బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పనకు జైట్లీ పెద్దపీట వేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగానూ మౌలిక వసతుల కల్పనకు రూ.5.97 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ కేటాయింపులు రూ. లక్ష కోట్ల మేరకు పెరిగాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి కేటాయించింది రూ. 4.94 లక్షల కోట్లే. వృద్ధికి ఊతమివ్వడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ రంగానికి కేటాయింపులు పెంచారు. రోడ్డు రవాణా, హైవేలకు మొత్తం రూ.71 వేల కోట్లు కేటాయించారు.
ప్రాజెక్టులపై నిరంతరం సమీక్ష
మౌలిక ప్రాజెక్టుల లక్ష్యాలు, వాటిని పూర్తి చేసే అంశాలను ప్రధాని మోదీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఇందుకోసం ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థను వినియోగిస్తున్నారని జైట్లీ చెప్పారు. ప్రస్తుతం రూ.9.46 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, వీటిని మరింత వేగవంతం చేస్తామన్నారు. రహదారులు, రైల్వేలకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ కేటాయింపులు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2018–19లో 9,000 కిలోమీటర్ల జాతీయ రహదారు లను విస్తరించనున్నట్టు ప్రకటిం చారు. భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా దేశ సరిహద్దులు, వెనకబ డిన ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీని విస్తరిస్తామన్నారు. భారత్‌మాల ఫేజ్ 1లో 35,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను, రూ.5.35 లక్షల కోట్లతో నిర్మిస్తామన్నారు. రైల్వే శాఖకు మూలధన వ్యయం కింద రూ.1,48,528 కోట్లు కేటాయించామని, దేశ భద్రత దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల్లో కనెక్టివిటీకి సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం సీప్లేన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 16 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటు చేస్తామని, వినియో గంలో లేని 56 ఎయిర్‌పోర్టులను, 31 హెలీప్యాడ్లను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.
పట్టణీకరణ ఓ అద్భుత అవకాశం..
పట్టణీకరణ ఒక అద్భుతమైన అవకాశమని, దీనికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన నిమిత్తం స్మార్ట్ సిటీ మిషన్‌ను ప్రారంభించిందని జైట్లీ చెప్పారు. ఇప్పటికే 99 నగరాలను ఎంపిక చేశామని, రూ. 2.04 కోట్లతో వీటిని అభివృద్ధి చేస్తున్నామని, ఈ నగరాల్లో స్మార్ట్ రోడ్లు, సోలార్ రూఫ్, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ మొదలైన ప్రాజెక్టులను చేపట్టామని తెలిపారు. రూ. 2,350 కోట్ల ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో రూ. 20,850 కోట్ల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలో 10 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని జైట్లీ ప్రకటించారు.
పేదల, ప్రజల బడ్జెట్: గడ్కరీ
ఇది పేదల, ప్రజల బడ్జెట్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. మౌలిక వసతుల రంగానికి ఎప్పటిలాగే బడ్జెట్‌లో ప్రాధాన్యత దక్కిందన్నారు. హైవేలకు నిధులు రూ.7 వేల కోట్లు పెరిగాయన్నారు. భారీ కేటాయింపులు జరపడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment