బీజేపీలోకి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే
పణాజి : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె గురువారం కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండుల్కర్ ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విశ్వజిత్ రేపు బీజేపీలో చేరబోతున్నారు. పార్టీలో చేరేందుకు ఆయన ఎలాంటి నిబంధనలు పెట్టలేదు’ అని తెలిపారు. విశ్వజిత్ రాణెను మంత్రివర్గంలోకి తీసుకుంటారా అని విలేకరుల ప్రశ్నకు వినయ్ టెండుల్కర్ సమాధానమిస్తూ ... అది ముఖ్యమంత్రి నిర్ణయమన్నారు.
అలాగే విశ్వజిత్ రాణె కూడా తాను బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. పార్టీ బలోపేతంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కాగా ఇటీవలి జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవడంతో తీవ్ర అసంతృప్తి చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె.. కాంగ్రెస్ పార్టీతో పాటుగా, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఐదు రోజులకే ఆయన రాజీనామా చేశారు.
40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అయితే బీజేపీ 13 సీట్లకే పరిమితం అయినా చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో మనోహర్ పారికర్ గోవా సీఎం పీఠాన్ని అధిరోహించారు.