అవును.. లాలుకు లంచం ఇచ్చాం
ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం క్విడ్ ప్రో కో బాగోతం కలకలం రేపుతోంది. కేంద్ర మాజీ మంత్రులు రఘునాథ్ ఝా, కాంతి సింగ్‌లు తాము లాలు కుటుంబానికి భూములు ఇచ్చామని చెప్పడంతో ఇది బయటపడింది. వాళ్లు తమకు భూములు ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే అది క్విడ్ ప్రో కో మాత్రం కాదని రాష్ట్రీయ జనతాదళ్ వర్గాలు వాదిస్తున్నాయి. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో తమకు కేంద్రంలో మంత్రిపదవులు ఇప్పించినందుకు వాళ్లిద్దరూ లాలు కుటుంబానికి భూములు ఇచ్చారని బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఆరోపించిన ఒక రోజు తర్వాత ఇదంతా బయటపడింది. పట్నా జిల్లాలోని దానాపూర్ గ్రామంలో సుమారు ఎకరం భూమిని తాము లాలు భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి 2006లో లీజుకు ఇచ్చామని కాంతిసింగ్ ఒప్పుకొన్నారు. ఆ తర్వాత అదే భూమిని రబ్రీదేవి పేరుతోనే 2010లో రిజిస్టర్ చేశామన్నారు. కేంద్రంలో మంత్రిపదవి ఇప్పించినందుకు గాను ముందుగా నెలకు రూ. 1250 చొప్పున 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారని మోదీ ఆరోపించారు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఓడిపోవడంతో మోదీ కుటుంబం సీఎం బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చిందని, లాలుకు 100 వరకు ఆవులు ఉండటంతో వాటిని వేరే చోటుకు తరలించడానికి గాను తన దానాపూర్ భూమిని తాత్కాలికంగా లీజుకు ఇచ్చానని, ఆ తర్వాత తాను 2009 ఎన్నికల్లో ఓడిపోవడంతో డబ్బు అవసరమై దాన్ని రబ్రీకి అమ్మేశానని కాంతిసింగ్ చెప్పారు.
అయితే సుశీల్ మోదీ మాత్రం ఆమె చెప్పిన విషయాన్ని ఖండించారు. రబ్రీకి అమ్మిన భూమి వేరని, అది చాలా చిన్న భూమి మాత్రమేనని, అది కాకుండా ఆ పక్కనే ఉన్న భూమిని కారు చవగ్గా లాలు కొడుకులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లకు ఇచ్చేశారని ఆరోపించారు. ఇక రఘునాథ్ ఝా కుమారుడు అజిత్ కుమార్ ఝా కూడా తన తండ్రి గోపాల్‌గంజ్‌లో ఉన్న ఒక ప్లాటును తేజస్వి, తేజ్‌ప్రతాప్‌లకు 2005లో బహుమతిగా ఇచ్చినట్లు అంగీకరించారు. అయితే అది వ్యక్తిగతం మాత్రమేనన్నారు. తన భూమిని తాను ఎవరికి కావాలన్నా ఇస్తానని, అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తన తండ్రి మంత్రిగా చేయడం మొదటిసారి ఏమీ కాదని, ఆయన అంతకుముందు కూడా ఎమ్మెల్యేగాను, ఎంపీగాను, మంత్రిగాను పనిచేశారని చెప్పారు.
ఇక ఈ భూముల విషయంలో ఆర్జేడీ వాదన మరీ విచిత్రంగా ఉంది. ''లాలు మా నాయకుడు. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడుతుంటారు. అందువల్ల ఇతర నాయకులు ఆయనను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల ఆయన ఉద్యమానికి నాయకత్వం వహించడానికి వీలవుతుంది'' అని ఆర్జేడీ నాయకుడు జగదానంద్ సింగ్ తెలిపారు.