
కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో ఆలయం గోడ కూలి నలుగురు దుర్మరణం చెందగా, సుమారు 27మంది గాయపడ్డారు. నార్త్ 24 పరగణ జిల్లాలోని కచ్వాలోని లోక్‌నాథ్ బాబా మందిర్‌లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఇంతలో ఆలయం గోడ ఒక్కసారిగా కూలడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటీన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన మృతుల ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50 వేలు తక్షణ సాయంగా ప్రకటన చేశారు.