
‘ఉరి’ తీసేస్తారా?
నిర్భయ రేప్ కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. 2012 డిసెంబరులో ఈ హత్యాచారం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ కోర్టు, హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వీరికి ‘ఉరే’ సరి అని తేల్చిచెప్పాయి. ఈ ప్రక్రియకు నాలుగున్నరేళ్ల సమయం పట్టింది. దోషులు ముకేశ్, అక్షయ్, పవన్, వినయ్‌లను ఇక ఉరి తీసేస్తారా? అంటే అప్పుడే తీయలేరు. వీరికి మరో మూడు అవకాశాలున్నాయి. అత్యంత హేయమైన నేరానికి ఒడిగట్టిన వీరికి ఈ మూడుచోట్ల కూడా చుక్కెదురైతేనే ఉరి కంబం ఎక్కుతారు. వీరి ముందున్న మార్గాలేమిటో చూద్దాం...
రివ్యూ పిటిషన్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 137 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష (రివ్యూ) కోరవచ్చు. తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయవచ్చు. విచారణలో ఏదైనా లోపం జరిగిందని స్పష్టంగా కనపడుతుంటే తప్ప నిర్భయ లాంటి కేసుల్లో రివ్యూ పిటిషన్‌ను అనుమతించకూడదని సుప్రీంకోర్టు రూల్స్ చెబుతున్నాయి. రివ్యూ పిటిషన్ విచారణకు స్వీకరించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు ఈ కేసును విచారించిన న్యాయమూర్తుల (రిటైరయితే తప్పితే) ముందుకే రివ్యూ పిటిషన్ కూడా వెళుతుంది. వారు తమ చాంబర్లో కూర్చొని రివ్యూ పిటిషన్‌ను అనుమతించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటారు. దోషుల తరఫున న్యాయవాది వాదనకు ఆస్కారం ఉండదు. రివ్యూ పిటిషన్ వేస్తామని శుక్రవారం తీర్పు వెలువడ్డాక దోషుల తరఫున న్యాయవాదులు తెలిపారు.
క్యూరేటివ్ పిటిషన్
భారత రాజ్యాంగంలో క్యూరేటివ్ పిటిషన్ ప్రస్తావన లేదు. న్యాయప్రక్రియలో లోపాలకు ఆస్కారమివ్వకూడదనే ఉద్దేశంతో 2002లో సుప్రీంకోర్టు ‘క్యూరేటివ్ పిటిషన్’ను పరిచయం చేసింది. విధివిధానాలకు రూపొందించింది.
1. రివ్యూ పిటిషన్ కొట్టివేశాక మాత్రమే క్యూరేటివ్ పిటిషన్‌కు ఆస్కారం ఉంటుంది. ఎన్ని రోజుల్లో అనేది నిర్దిష్టంగా ఏమీ చెప్పలేదు.
2. కోర్టు తీర్పు సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా ఉందని పిటిషనర్ ససాక్ష్యంగా ఎత్తిచూపినపుడు మాత్రమే... క్యూరేటివ్ పిటిషన్‌ను అనుమతిస్తారు.
3, సహజ న్యాయసూత్రాలకు భంగం వాటిల్లిందని ఒక సీనియర్ న్యాయవాది ధృవీకరించాలి. క్యూరేటివ్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను విశదీకరించాలి.
4. క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని ముగ్గురు అత్యంత సీనియర్ జడ్జిల (ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ ముగ్గురిలో ఉండాలని నియమమేమీ లేదు) ముందుంచుతారు. తర్వాత తుదితీర్పునిచ్చిన జడ్జిల ముందుంచుతారు. విచారించాల్సిన అవసరముందని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడితే... క్యూరేటివ్ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తారు. లేదా తిరస్కరణకు గురవుతుంది.
క్షమాభిక్ష పిటిషన్
న్యాయపరమైన మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు... దోషులు భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టొచ్చు. మరణశిక్షను యావజ్జీవంగా మార్చవచ్చు. ఈ పిటిషన్‌లపై మంత్రివర్గం సలహామేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది. హోంశాఖ అభిప్రాయం మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌లపై నిర్ణయం తీసుకుంటారు. క్షమాభిక్ష పిటిషన్‌ను ఎంతకాలంలో పరిష్కరించాలనే విషయంలో గడువు ఏమీలేదు. ఫలితంగా ఏళ్లకు ఏళ్లు గడిచిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడంలో అసాధారణ జాప్యం జరిగిందనే కారణంతో మరణశిక్షను జీవితఖైదుగా కోర్టులు మార్చిన సందర్భాలూ ఉన్నాయి.
‘ఉరి’తీతలో రాజకీయం
హోంశాఖ అభిప్రాయం మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌లపై నిర్ణయానికి వస్తున్నారు. దీని కారణంగా రాజకీయ జోక్యానికి ఆస్కారం ఏర్పడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏ నిర్ణయమైనా తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. ఇందుకు ఆఫ్జల్ గురు ఉరి అమలు మంచి ఉదాహరణ. భారత పార్లమెంటుపై 2001 డిసెంబరు 13న దాడి జరిగింది. ఎనిమిది మంది రక్షణ సిబ్బంది, ఒక తోటమాలి చనిపోయారు. ఈ దాడికి కుట్ర చేశారనే అభియోగంపై అఫ్జల్ గురుపై కేసు పెట్టారు. 2005 ఆగష్టు 4న సుప్రీంకోర్టు ఆఫ్జల్ గురుకు మరణశిక్షను ఖరారు చేసింది. రివ్యూ పిటిషన్‌నూ తొసిపుచ్చింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం... మైనారిటీ ఓట్లను దృష్టిలో పెట్టుకొని అమలుపై నాన్చివేత ధోరణిని అవలంభించింది. చివరకు దేశ భధ్రత విషయంలో సరిగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వచ్చినపుడు... ఒత్తిడికి లోనై చివరకు ఫిబ్రవరి 9, 2013న గోప్యంగా ఉరితీసింది. భారత ప్రజాస్వామ్యానికి, సార్వభౌమాధికారానికి ప్రతిబింబమైన పార్లమెంటు భవనంపై దాడికి కుట్ర పన్నారని న్యాయస్థానాలు తేల్చి... మరణశిక్ష విధించిన వ్యక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైఖరి కారణంగా, క్షమాభిక్ష పిటిసన్‌పై నిర్ణయం వెలువడక ఏడున్నరేళ్లు ప్రాణాలతో ఉన్నాడు. ఇప్పుడు నిర్భయ దోషుల విషయంలోనూ ‘రాజకీయ మైలేజీ’ ప్రధానపాత్ర వహించొచ్చు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్