'వాడొక పిచ్చి కుక్క.. దూరంగా ఉండండి'
లక్నో: ఫ్రాన్స్ లో దాడికి పాల్పడిన ముస్లిం ఉగ్రవాది పిచ్చికుక్కతో సమానం అని షియా మత పెద్ద మౌలానా కాబి సాదిక్ అన్నారు. లక్నోలో ఓ మెడికల్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉగ్రవాదం అంశంపై మాట్లాడుతూ మానవత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలకైనా ముస్లింలు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దాడికి పాల్పడని వ్యక్తి పిచ్చి కుక్కతో సమానం అని ఆయన అభివర్ణించారు.
అనవసరంగా అమాయకులను పొట్టన పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పాడు. ప్రపంచంలోని ముస్లింల అందరి జీవితాలను బాగుచేసేది ఒక్క విద్యేనని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క ముస్లిం మంచి విద్యావంతుడిగా మారాలని చెప్పారు. మాజీ రాష్ట్రపతి, భారత రత్న అబ్దుల్ కలాంను చూసి ఆ విషయం నేర్చుకోవాలని హితవు పలికారు. భారత్ మాతాకి జై అనేందుకు ఇష్టపడని ముస్లింలు భారత్ అమ్మికి జై అనొచ్చని అన్నారు.