
ఉచిత హామీలు సులభమే.. ఆచరణే కష్టం!
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ప్రతిసారీ ఎన్నికల ప్రచారాల్లో ప్రజలకు ఇచ్చే ఉచిత హామీలు చెప్పడానికి బాగుంటాయి కానీ.. ఆచరణలో చాలా కష్టమని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇండియా టుడే సమావేశంలో పాల్గొన్న ఆయన ఢిల్లీలో అధికార పీఠం చేపట్టిన 'ఆప్' ను పరోక్షంగా విమర్శించారు. ఆప్ కు కొంత సమయం ఇవ్వాలంటూనే.. అన్ని ఉచితంగా ఇస్తామంటూ చేసే హామీల ప్రకటనలు ఆచరణలో కష్టమని చురక వేశారు.
మార్చి 1న న్యూఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆమ్ అద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 20వేల లీటర్ల నీళ్లు ప్రతినెల ఉచితంగానూ, నెలకు 400 యూనిట్ల లోపు వినియోగించేవారికి 50 శాతం వరకు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ విషయంపై గడ్కరీ మాట్లాడుతూ... ఉచిత హామీలు అమలు చేయాలంటే.. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అడ్డంకులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్రప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తే.. రాష్ట్ర పరిస్థితి ఇబ్బందులో పడుతుందని అన్నారు.