
వాళ్లను చంపడం జాతి ధర్మం
జేఎన్‌యూ వివాదం ఇంకా రగులుతూనే ఉంది. అక్కడి విద్యార్థి సంఘ నేతలు కన్హయ్యకుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను చంపేస్తామంటూ ఎప్పటికప్పుడు కొత్గా పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇంతకుముందు కన్హయ్యను చంపితే 11 లక్షలు ఇస్తానని ప్రకటించిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే జైల్లో పెట్టారు. ఈ లోపు వాట్సప్, ఇతర సోషల్ మీడియాలో మరో పోస్టర్ ప్రచారంలోకి వచ్చింది. ''జేఎన్‌యూ ద్రోహులను కాల్చి చంపడం జాతిధర్మం. నేను ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, కన్హయ్యలను కాల్చేస్తా'' అని ఈ పోస్టర్‌లో ఉంది. తన పేరు బల్బీర్ సింగ్ భారతీయ అని, తాను సమాజ సేవకుడినని, అన్నా హజారే నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని అందులో పేర్కొన్నాడు. పోస్టర్‌లో తన ఫోన్ నంబర్, పాస్‌పోర్టు సైజు ఫొటో కూడా పెట్టాడు. జేఎన్‌యూ విద్యార్థులకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆ పోస్టర్‌లో ఖండించారు.
''అఫ్జల్‌గురు ఉరితీత దినం రోజున పండగ చేసుకున్నవారిని నేను కాల్చేస్తా.. ఉగ్రవాదుల కంటే వెన్నుపోటుదారుల వల్లే దేశానికి ఎక్కువ ముప్పు ఉంది. ఇలాంటి వాళ్లకు జీవితఖైదు విధించాలి'' అని కూడా పోస్టర్‌లో రాశారు. ఈ విషయంపై ఇప్పటికే విచారణ ప్రారంభిచినట్లు డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు. పోస్టర్‌లో ఉన్న నంబరుకు పోలీసులు ఫోన్ చేస్తే, తనకు యమునా బజార్‌లో ఓ దుకాణం ఉందని అవతలి వ్యక్తి చెప్పాడు. అయితే పోస్టర్లు వేసిన విషయం గురించి మాత్రం అతడు పెద్దగా స్పందించలేదు. అతడిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.