అమిత్ షా
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కేంద్రం 42 శాతం నిధులు కేటాయించిందని, అందువల్ల రాష్ట్రాలు తమ ప్రణాళికా వ్యయంలో ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నేత మల్లేపల్లి లక్ష్మయ్య, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, మాజీ ఉన్నతాధికారులు మాధవరావు, కృష్ణన్ తదితరులు ఈరోజు అమిత్ షాను కలిశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో సబ్ ప్లాన్ చట్టం తీసుకురావాలని ఈ ప్రతినిధి బృందం ఆయనను కోరింది.
ఈ సారి రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున కోత పడిన విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రాష్ట్రాలకు కేటాయించన నిధుల వివరాలు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుందని తెలిపారు.
అనంతరం మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సబ్ప్లాన్ తీసుకువచ్చే విషయంపైనా ఆలోచన చేస్తామని అమిత్ షా చెప్పినట్లు తెలిపారు.