ఉచిత ట్యూషన్ల కోసం మొబైల్ యాప్
విద్యార్థులకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. అయినా కొన్ని సబ్జెక్టులలో అనుమానాలు తలెత్తుతూనే ఉంటాయి. కొందరికి ఫిజిక్స్‌లో అయితే మరికొందరికి కెమిస్ట్రీ, ఇంకొందరికి మ్యాథ్స్.. ఇలా రకరకాల అనుమానాలు తలెత్తుతుంటాయి. వాటికి అప్పటికప్పుడే నిపుణులతో సమాధానాలు చెప్పించేందుకు ఓ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన హాష్ ఎడ్యుకేషన్ అనే స్టార్టప్ కంపెనీ ఈ యాప్‌ను లాంచ్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్న ఈ యాప్ మార్చి 31 వరకు సైనప్ చేసుకున్న విద్యార్థులకు నెల రోజుల పాటు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఐఐటీలు, బిట్స్‌లో చదివిన నిపుణులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో వచ్చే అనుమానాలను తక్షణం నివృత్తి చేస్తారు.
ప్రతి ఒక్క విద్యార్థికీ అత్యున్నత నాణ్యతతో కూడిన ప్రైవేటు ట్యూషన్లు అందించాలన్నదే తమ లక్ష్యమని, అందరూ భరించగలిగే స్థాయిలోనే దీన్ని అందిస్తామని హాష్‌లెర్న్ సంస్థ సీఈవో జయదేవ్ గోపాలకృష్ణన్ చెప్పారు. 8 నుంచి 12వ తరగతి వరకు ఉండే అన్ని బోర్డు పరీక్షలు, జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకు సంబంధించిన ప్రశ్నలకు ఇందులో సమాధానాలిస్తారు. ఏదైనా టాపిక్ గురించి అనుమానం ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇమేజిని అప్‌లోడ్ చేయాలి. వెంటనే దానికి సంబంధించిన సబ్జెక్టు నిపుణుడు లైన్లోకి వస్తారు. ఆయన అనుమానాన్ని తీర్చిన తర్వాత ఆ ట్యూటర్‌కు రేటింగ్ కూడా విద్యార్థి ఇవ్వాలి. అలాగే, విద్యార్థులు ప్రాక్టీసు చేసుకోడానికి వీలుగా వేలాది ప్రాక్టీసు ప్రశ్నలను కూడా అందుబాటులో ఉంచామని హాష్‌లెర్న్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.