
ఆయన శవం ఎవరికీ వద్దంట
మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో 24మంది మృతికి కారణమైన అల్లర్లకు ప్రధాన సూత్రధారి అయిన రామ్ వృక్ష్ యాదవ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మథురకు వచ్చి అతడి మృతదేహం తీసుకెళ్లాల్సిందిగా రాయ్ పూర్ బాఘ్ పూర్, ఘాజిపూర్ వాసులకు సమాచారం అందించినా వారు తిరస్కరించారు. అసలు అతడి మృతదేహం తమ ఊళ్లోకి వద్దని అక్కడి వారు అన్నారంట. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.
యాదవ్ నేతృత్వంలోని మూడువేల మంది మథురలోని జవహర్ బాగ్ పార్కును ఆక్రమించి రెండేళ్లుగా మకాం వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ పార్కును ఖాళీ చేసేందుకు పోలీసులు వెళ్లగా యాదవ్ అనుచరులు ఏకే 47 తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు-ఆందోళనకారుల మధ్య జరిగిన రణరంగంలో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది.
ఈ ఘర్షణలో మథుర జిల్లా ఎస్పీ ముకుల్ ద్వివేది, ఫర్హా పోలీసు స్టేషన్ ఆఫీసర్ సంతోష్ యాదవ్ మృతిచెందారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 24 మంది చనిపోయారు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారిలో ఈ ఆందోళనకు ప్రధాన సూత్రధారి అయిన రామ్ వృక్ష్ యాదవ్ కూడా ఉన్నాడు. దీంతో అతడి మృతదేహం తీసుకెళ్లాలని పోలీసులు ఆదేశించగా ఎవరూ ముందుకు రాలేదు.