
అక్కడి నుంచి పోటీకి కేంద్ర మంత్రి విముఖత..
పట్నా : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తనకు కేటాయించిన నియోజకవర్గంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్ధానం నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని కోరడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. బిహార్‌లోని నవాదా స్ధానం నుంచి ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందగా, ప్రస్తుతం గిరిరాజ్ సింగ్‌ను బెగుసరై నుంచి బరిలో దింపాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది.
బిహార్‌లో ఏ ఒక్క ఎంపీ నియోజకవర్గాన్నీ మార్చకుండా తనను వేరే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని పార్టీ కోరడంతో తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని గిరిరాజ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. ఎందుకు పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుందో బిహార్ బీజేపీ నాయకత్వం తనకు చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.
నవాదా నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి తాను కష్టపడి పనిచేశానని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు బెగుసరై నుంచి సీపీఎం తరపున జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ను పోటీలో నిలిపింది. బెగుసరై నుంచి పోటీకి నిరాకరిస్తున్న కేంద్ర మంత్రి తీరును కన్నయ్య కుమార్ తప్పుపట్టారు. హోంవర్క్ చేయలేదని చిన్న పిల్లలు స్కూల్‌కు వెళ్లమని మారాం చేస్తున్నట్టుగా కేంద్ర మంత్రి వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు.