సాక్షి, ముంబై : మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. రాధాబాయ్ కాలే మహిళా కళాశాలకు చెందిన పదకొండో తరగతి విద్యార్థిని కిషోరి బబన్ కకాడే అనే విద్యార్థిని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుందని ఎస్పీ రంజన్ కుమార్ శర్మ చెప్పారు.
మరాఠాలకు కోటా కోరుతూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని బాలిక లేఖలో పేర్కొంది. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో తాను 89 శాతం మార్కులు సాధించినా పదకొండో తరగతిలో సైన్స్ గ్రూపులో అడ్మిషన్ సాధించలేకపోయానని లేఖలో పేర్కొందని ఎస్పీ తెలిపారు. వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే తన తండ్రి రూ 8000 ఫీజు చెల్లించడంతో అడ్మిషన్ పొందానని, ఫీజు చెల్లించడం తన కుటుంబానికి భారమని, రిజర్వేషన్ వర్తించే కులాల్లో 76 శాతం మార్కులు వచ్చినా వారికి కేవలం రూ 1000 ఫీజుతో అడ్మిషన్ లభించిందని లేఖలో బాలిక ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా రంగంలో రిజర్వేషన్లు లేని మరాఠా వర్గానికి చెందడంతో తాను వివక్ష ఎదుర్కొన్నానని బాలిక పేర్కొందని పోలీసులు తెలిపారు. తన మరణంతో మరాఠా ఉద్యమం బలపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బాలిక ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వ తీరును పలు మరాఠా సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి.
Comments
Please login to add a commentAdd a comment