స్కూలుకు వెళ్ళేందుకు భయపడిపోతున్నారు!
హర్యానాః రెవారీలో బాలికలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. గత నెల్లో జరిగిన అత్యాచార ఘటనతో బిడ్డల రక్షణే ప్రధానంగా భావిస్తున్న తల్లిదండ్రులు సమీప గ్రామాల్లో చదువులకు పంపేందుకు నిరాకరిస్తున్నారు. ఓ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనతో ఆందోళన చెందిన స్థానికులు ఏకంగా బాలికలను చదువకే దూరం చేస్తున్నారు.
గతనెల్లో ఓ పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం జరగడంతో హర్యానా రెవారీ గ్రామంలోని విద్యార్థినులను పాఠశాలల కు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. ఏ సమయంలో ఎటువంటి ఆపద ముంచుకొస్తుందోనని భయపడిపోతున్నారు. పక్కనే ఉన్న సుమాఖేరా గ్రామ పంచాయితీలో ఉన్న ఒకే ఒక్క పాఠశాలకు పిల్లలను బలవంతంగా పంపించాల్సి వస్తోందని, మార్గ మధ్యంలో పిల్లలకు రక్షణ కరువుగా ఉందని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలకు వెళ్ళే 38 మంది విద్యార్థినులు చదువు మానుకున్నారు.
రెవారీ సమీప గ్రామం లాలా లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు తల్లిదండ్రులు పిల్లలను పంపించడంలేదని, కనీసం 38 మంది బాలికలు అక్కడి స్కూలుకు రావడం మానుకున్నారని రెవారీ డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్ తెలిపారు. ఏప్రిల్ 18న జరిగిన అత్యాచార ఘటనతో పొరుగు గ్రామంలోని ప్రభుత్వపాఠశాలకు పంపేందుకు భయపడిపోతున్నారని గార్గ్ తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాల జాబితాలోని 4 నుంచి 7 తరగతుల అమ్మాయిల పేర్లను తొలగించిన పంచాయితీ.. సుమాఖేరాలో పాఠశాలను సీనియర్ సెకండరీ స్థాయికి అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రైమరీ స్కూళ్ళను అప్ గ్రేడ్ చేసి, సుమాఖేరాలో పాఠశాలను 8వ తరగతి వరకూ పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఇదే నేపథ్యంలో స్థానికులు శుక్రవారం ధర్నాకు కూడ దిగి, డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్ కు వినతి పత్రాలను కూడ అందజేశారు. దీంతో ప్రస్తుతం సుమాఖేరాలోని ప్రైమరీ స్కూల్ ను అప్ గ్రేడ్ చేయడంలో ఆలస్యమైనా.. జిల్లా అధికారులు లాలా గ్రామంలో పాఠశాల భద్రతపై స్థానికులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని గార్గ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖటార్ ఇరు గ్రామాల ప్రజలు ఓ అవగాహనకు వచ్చి సుమాఖేరాలో ప్రైమరీ స్కూల్ ను 8వ తరగతి వరకూ అప్ గ్రేడ్ చేసేందుకు సహకరించాలని తెలిపారు. ఇరు గ్రామాల్లోని ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు కూడ చేస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే బాలికలకోసం ప్రవేశ పెట్టిన బేటీ బచావ్, బేటీ పఢావ్ ప్రచారం బాలికల్లో ఏమాత్రం విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపడం లేదని, వారికి రక్షణ కరువవ్వడంతో తల్లిదండ్రులు బలవంతంగా చదువు మాన్నించేస్తున్నారంటూ ప్రతిపక్ష ఐఎన్ఎల్డీ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడాన్ని కూడ ఐఎన్ ఎల్డీ నాయకుడు అభయ్ సింగ్ చౌతాలా తప్పుబట్టారు.