లీటర్ పెట్రోల్ ధర రూ.60 దాటకూడదని..
పణజి: పెట్రోల్ ధరలపై ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు గోవా సర్కారు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించింది. పెట్రోల్ పై వ్యాట్ ను 2 శాతం తగ్గించింది. దీంతో రాష్ట్రంలో పెట్రోల్ పై వ్యాట్ 22 శాతం నుంచి 20 శాతానికి తగ్గిందని వాణిజ్య పన్నుల విభాగం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. లీటర్ పెట్రోల్ ధర రూ.60 దాటనీయబోమని బీజేపీ సర్కారు ఎన్నికల్లో హామీయిచ్చింది.
చమురు కంపెనీలు గత రాత్రి పెట్రోల్ ధర లీటర్ కు 83 పైసలు పెంచాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర గోవాలో రూ.60 దాటిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు వ్యాట్ తగ్గించి పెట్రోల్ ధర రూ.60 మించకుండా చేసింది. ప్రస్తుతం గోవాలో లీటర్ పెట్రోల్ ధర రూ.59.70గా ఉంది.
గోవాలో 2012లో అధికారం చేపట్టిన బీజేపీ పెట్రోల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేసింది. ఫలితంగా పెట్రోల్ ధర లీటరకు రూ.11 తగ్గింది. రాష్ట్ర ఖజానాకు రూ. 150 కోట్ల నష్టం వాటిల్లుతుండడంతో నిర్ణయాన్ని మార్చకుని మళ్లీ వ్యాట్ విధించింది.