గోవాలో మైనింగ్‌పై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: గోవాలో అన్ని ఖనిజాల తవ్వకంపై తన ఆదేశాల ప్రకారం 18 నెలలుగా కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీం కోర్టు సోమవారం కొన్ని షరతులతో ఎత్తేసింది. ఏటా 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని తవ్వుకోవడానికి అనుమతించింది. మైనింగ్‌పై తను నియమించిన నిపుణుల కమిటీ తుది నివేదిక ఇచ్చేంతవరకు తవ్వకాలపై గట్టి నియంత్రణ ఉంచాలని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని హరిత ధర్మాసనం..
కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు, గోవా ప్రభుత్వానికి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 2007 నవంబర్ 22 తర్వాత లీజులు తీసుకున్న వారి తవ్వకాలు చట్టవిరుద్ధమని, లీజు ప్రాంతం వెలుపల ఖనిజాన్ని డంప్ చేయకూడదని పేర్కొంది. జాతీయ పార్కులు, అభయారణ్యాలకు ఒక కి.మీ దూరంలో మైనింగ్ జరపొద్దని ఆదేశించింది. కోర్టు తీర్పుపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.