గూగుల్ లక్ష్యం @ 100 కోట్లు..
ముంబై: భారత్‌లో ఇంటర్‌నెట్ వినియోగదారుల సంఖ్యను వంద కోట్లకు చేర్చాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు గూగుల్ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ ఆగ్నేయ ఆసియా, భారత్‌ల వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ ముంబైలో వెల్లడించారు. అయితే ఎప్పటిలోపు దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో మాత్రం ఆయన చెప్పలేదు.
ప్రస్తుతం భారతదేశంలో ఇంటర్‌నెట్‌ను వినియోగించేవారు 35 కోట్లు ఉన్నారనీ ప్రకటించారు. 2020 నాటికి 60 కోట్లకు చేరవచ్చనే అంచనాలున్నాయని ఆనందన్ పేర్కొన్నారు. ఇంటర్‌నెట్‌ను ప్రజలకు మరింత చవకగా, అందరికీ అందుబాటులోకి తెస్తేనే ఈ లక్ష్యాన్ని సాధించగలమని ఆయన వివరిం చారు. రైల్‌టెల్ భాగస్వామ్యంతో ఇప్పటికే గూగుల్ దేశంలోని 27 రైల్వే స్టేషన్లలో అందిస్తున్న ఉచిత వైఫై సౌకర్యాన్ని ఈ సందర్భంగా ఆనందన్ ఉదహరించారు.