ముంబై: మానవాళికి ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్(కోవిడ్-19)ను కట్టడికై పలు చర్యలు చేపడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారికి ఇకపై ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించబోమని.. అయితే వారి మత విశ్వాసాల ప్రకారం కోరిన విధంగా ఖననం లేదా దహనం(ఎలక్ట్రిక్ పద్ధతి) చేస్తామని వెల్లడించింది. అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో అంటువ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పర్సనల్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) ధరించిన నిపుణుల బృందం ఈ మేరకు విధులు నిర్వర్తిస్తుందని తెలిపింది. షిఫ్టుల పద్ధతిలో 24 గంటలు ఈ బృందం అందుబాటులో ఉంటుందని పేర్కొంది.(ప్రధానితో కాన్ఫరెన్స్: అందరి నోట అదే మాట!)
ఈ బృందం పర్యవేక్షకుడిగా వ్యవహరించనున్న పుణె కలెక్టర్ కిషోర్ రామ్ మాట్లాడుతూ.. ‘‘సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి.. అక్కడ ఆరు అడగుల లోతులో గుంతలు తవ్వి మృతదేహాలు పూడుస్తాం. రెండు ప్లాస్టిక్ సంచుల్లో మృతదేహాలను చుట్టి సీల్ వేస్తాం. అంటువ్యాధి ప్రబలకుండా సోడియం హైపోక్లోరైట్ చల్లుతాం’’అని పేర్కొన్నారు. ఇక కరోనా మృతదేహాలను దహనం చేసేందుకు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ మిషన్లను అందుబాటులోకి తీసుకువస్తామని మరో అధికారి రాజేంద్ర గోలే తెలిపారు. కాగా పుణె జిల్లాలో ఇప్పటివరకు కరోనాతో 25 మంది చనిపోగా.. 245 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపు 1574 మంది కరోనా బారిన పడగా.. 110 మంది మృతి చెందినట్లు సమాచారం. కాగా దేశ వ్యాప్తంగా 239 మరణాలు సంభవించగా.. 7447 మంది వైరస్ బారిన పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment