న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 81,466 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కి చేరుకున్నట్టు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన వెల్లడించింది. దేశవ్యాప్తంగా 469 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,63,396కి చేరుకుంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలలో కరోనా ఉధృతి ఆందోళన పుట్టిస్తోందని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్‌లో కరోనా కట్టడికి కొన్ని పట్టణ ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి లాక్‌డౌన్ విధించారు. ఏప్రిల్ 5 వరకు ఈ లాక్‌డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
రెండో డోసు తీసుకున్నా కరోనా పాజిటివ్
ఉత్తర ప్రదేశ్‌కి చెందిన సీనియర్ పోలీసు అధికారికి కోవిడ్–19 రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. తాను రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) రాజేశ్ పాండే ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. తన భార్య కరోనా టీకా ఒక డోసు తీసుకున్నారని, ఆమెకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మూడు రోజుల క్రితం వాళ్లబ్బాయికి కరోనా సోకింది.
రాబర్ట్ వాద్రాకు కరోనా
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు కోవిడ్–19 పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రియాంకా శుక్రవారం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అస్సాంలో శుక్రవారం, తమిళనాడులో శనివారం, కేరళలో ఆదివారం పాల్గొనాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ‘నాకు కోవిడ్–19 నెగెటివ్‌గా నిర్థారణ అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటాను’ అని ఆమె తెలిపారు.
రికార్డు స్థాయి వ్యాక్సినేషన్
ఓ వైపు కరోనా కేసులు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు జనం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి బారులు తీరుతున్నారు. 45 ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తూ ఉండడంతో 24 గంటల్లో 36.7 లక్షలకుపైగా మంది కోవిడ్–19 టీకాలు తీసుకున్నారు. ఒకే రోజులో ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. యొత్తంగా 36,71,242 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. 33,65,597 మంది మొదటి డోసు తీసుకుంటే, 3,05,645 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.87 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ
మహారాష్ట్ర కోవిడ్–19 గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. రాష్ట్రంలో ఒకే రోజు 43,183 కేసులు నమోదయ్యాయి. పుణేలో గత రెండు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో శనివారం నుంచి వారం రోజులు రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మాల్స్, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, బార్లు వారం రోజుల పాటు సాయంత్రం 6 గంటలకే మూసేయాల్సి ఉంటుందని ఆదేశించారు.
దేశంలో కరోనా విలయం, ఒక్కరోజే 81,466 కేసులు
Published Sat, Apr 3 2021 5:21 AM | Last Updated on Sat, Apr 3 2021 12:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment