
సాక్షి, ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దిగిరాకపోతే ఎంపీల పదవులకు రాజీనామాలు చేసి.. వెంటనే ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని వైఎస్సార్ సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ వాయిదా పడిన వెంటనే వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, వెంటనే దీక్షకు దిగనున్నారు. కాగా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా సాధన కోసం తాము చేస్తున్న పోరాటానికి అండగా నిలిచి ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అనుమతించాలంటూ ఎంపీలు ఇప్పటికే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఎంపీల దీక్షకు సంఘీభావం తెలపండి: వైఎస్ జగన్
ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు సంఘీభావం తెలపాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు రిలే దీక్షల్లో పాల్గొనాలని, ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత రిలే దీక్షల్లో పాల్గొని మద‍్దతు తెలిపాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment