ఈ ఏడాది నవంబర్ కల్లా కేంద్ర మంత్రులు, కీలక అధికారులు దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ కార్లలో తిరగనున్నారు.
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్ కల్లా కేంద్ర మంత్రులు, కీలక అధికారులు దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ కార్లలో తిరగనున్నారు. దాదాపు 1000 ఎలక్ట్రిక్ కార్లను మంత్రులు, అధికారులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచంలో ఇంధన దిగుమతిలో మూడో స్ధానంలో ఉన్న భారత్.. ఆ భారం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది.
ఆలోచనను కార్యాచరణలో పెడుతూ.. ప్రభుత్వం నుంచే మార్పుకు నాంది పలికేందుకు సిద్ధమైంది. ఎలక్ట్రిక్ కార్ల కోసం నేషనల్ కేపిటల్ రీజయన్(ఎన్‌సీఆర్) పరిధిలో 400లకు పైగా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే యూరప్ ఖండంలోని కొన్ని దేశాలు ఎలక్ట్రిక్ కార్లను వినియోగిస్తూ అత్యధికంగా ఇంధనాన్ని ఆదా చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని పది వేల ఎలక్ట్రిక్ కార్లకు బిడ్‌లను ఆహ్వానించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
కార్ల కోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) శుక్రవారం బిడ్‌లను ఆహ్వానించనుంది. పెట్రోల్ బంకుల వద్ద ఎల్‌ఈడీ విద్యుత్తు దీపాల అమ్మకానికి ఈఈఎస్‌ఎల్, పెట్రోల్ బంకుల యాజమాన్యాల మధ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సందర్భంగా వెయ్యి ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని ఈఈఎస్‌ఎల్ ఎండీ సౌరభ్‌కుమార్ వెల్లడించారు. ఒకసారి చార్జ్ చేస్తే 120-150 కిలోమీటర్ల మైలేజ్‌ను ఎలక్ట్రిక్‌కార్లు ఇస్తాయని చెప్పారు. ఈ కార్లకు మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుందని తెలిపారు.