గ్యాస్ ఆధారిత ప్లాంట్లు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఇకపై గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లు నెలకొల్పవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లు గ్యాస్ లభ్యత లేక కుంటుపడ్డాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీడీపీ ఎంపీ రవీంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తొలుత ఎంపీ కొండా మాట్లాడుతూ ‘తెలంగాణలో విద్యుత్ కొరత ఉంది. అయితే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో ఈ విషయంలో వివాదం ఉన్నప్పటికీ గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో ఏప్రిల్‌లో కరెంటు కోతలు లేవు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఎక్స్ఛేంజీలో కరెంటు కొన్నది. ఈ విధానంలో అక్కడ ప్రతి 15 నిమిషాలకు ధర మారుతోంది. ఒక్కోసారి మేం యూనిట్‌కు రూ. 8 నుంచి 9 వరకు చెల్లిం చాల్సి వచ్చింది. అయితే ఇది ఆర్థిక భారంతో కూడుకున్నది. శంకరపల్లిలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంటు కోసం 2000 సంవత్సరంలో 200 ఎకరాల భూమి సేకరించాం. కానీ ఇప్పటివరకు ప్లాంటు ఏర్పాటుకాలేదు’ అని అన్నారు.
దీనికి పీయూష్ గోయల్ సమాధానమిస్తూ.. ‘తెలంగాణ ప్రజలకు నిరంతరాయ విద్యుత్ ఇస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. అన్ని రాష్ట్రాలు దీన్ని అవలంబించవచ్చు. దేశంలో అనేక రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉంది. విద్యుత్ ఎక్స్ఛేంజీలోగానీ, దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా గానీ దీనిని పొందవచ్చు. విద్యుత్ ఎక్స్ఛేంజీ విధానంలో యూనిట్‌కు రూ. 8 వెచ్చించామని సభ్యుడు చెబుతున్నారు. నేను నిన్న పవర్ గ్రిడ్ మాని టరింగ్ కార్యాలయంలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 3.30 గంటలకు పవర్ ఎక్స్ఛేంజీ రేటు యూనిట్‌కు సున్నా ధర ఉంది. ఆ సమయం లో విద్యుత్ అవసరానికి మించి అందుబాటులో ఉంది. అందువల్ల దానిని ఉచితంగా ఇవ్వడం కంటే వేరే దారి లేదు. ఇక శంకరపల్లి విషయానికి వస్తే.. దేశంలో గ్యాస్ కొరత ఉంది. 14 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ప్రస్తుతం గ్యాస్ కొరతతో పనిచేయ డంలేదు. రాష్ట్రాలు ఇకపై గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పవద్దని కోరుతున్నా. దానికి బదులు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుచేసుకోవాల’ని స్పష్టం చేశారు.