మూడేళ్లైనా 39 మంది భారతీయుల జాడలేదు
న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఆచూకీ దొరకని భారతీయులను వెతికి స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతశాఖల మంత్రి విజయ్ సంప్లా అన్నారు. మూడేళ్ల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన 39 మంది భారతీయులు ప్రస్తుతం బుదుష్‌లోని జైల్లో ఉండే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే బుదుష్‌లోని జైలు ఎప్పుడో నెలమట్టం అయిందన్న వార్తలు ప్రచారం కావడంతో బాధితుల కుంటుంబాల్లో ఆందోళన తీవ్రమైంది.
ఇరాక్ రాయభారి కార్యాలయం ఆదేశానుసారం అధికారులు ఆచూకీ లేని భారతీయుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులను ఈ పని నిమిత్తం ఇరాక్‌కు పంపి చర్యలు చేపట్టిందని, త్వరలోనే బాధితులను భారత్‌కు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుదుష్ జైలు గురించి పూర్తి వివరాలు తనకు తెలియదని, విదేశాంగశాఖకు దీనిపై సమాధానం చెబుతుందని కేంద్ర మంత్రి సంప్లా అన్నారు. మీడియా సహకారంతోనే భారతీయులను వెనక్కి రప్పించడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశాల్లో తప్పిపోవడం, ఆచూకీ లేకుండా పోయిన భారతీయులు ఎక్కువగా పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారని మంత్రి విజయ్ సంప్లా తెలిపారు. రేపు (సోమవారం) ఇరాక్ విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే.