
‘ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు’
రూ. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని కేంద్ర సమాచార, ప్రసార, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.
న్యూఢిల్లీ: రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని, 2014 నుంచి తీసుకుంటున్న అనేక చర్యల్లో ఇది ఒకటని కేంద్ర సమాచార, ప్రసార, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైంది. విప్లవాత్మకమైంది. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడం కోసం, నల్ల ధనాన్ని అరికట్టడం కోసం, అవినీతికి కళ్లెం వేయడం కోసం తీసుకున్న ఈ చర్యకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. అన్ని వర్గాలు ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని అభినందిస్తున్నారు. ఇదేదో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆర్థిక వ్యవస్థను సంస్కరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
నల్లధనం వెలికితీసే ప్రయత్నం మొదటి కేబినెట్ మీటింగ్‌లోనే ప్రారంభమైంది. ఆ తరువాత కఠిన చట్టాలు తెచ్చింది. నల్లధనాన్ని పన్ను చెల్లించి మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. ఆ తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పొరుగు దేశాలు ప్రత్యామ్నాయ కరెన్సీని ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేవారి ఆటలు కట్టించే ప్రయత్నమే కాకుండా నిజాయతీగా పన్ను కట్టేవారికి వెన్నుదన్నుగా నిలిపే చర్య ఇది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఆ సంపద ప్రజలకు చేరుతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే చిత్తశుద్ధి ఉండాలి. నాయకత్వానికి దూరదృష్టి ఉండాలి. ఈ చర్య సానుకూల ఫలితాన్ని ఇస్తుంది.
స్థిరాస్తి రంగంలో భూముల ధరలు తగ్గుతాయి. ధరల స్థిరీకరణ జరుగుతుంది. ద్రవ్యోల్భణం తగ్గుతుంది. పేద, మధ్య తరగతి, వేతన జీవులకు ఉపయోగకరమైన పరిణామం. ఆర్థిక పరిపుష్టితోపాటు సాంఘిక భద్రతను ఈ ప్రభుత్వం ప్రజలకు తెచ్చిపెడుతోంది. కేవలం ఏదో ఒకటి అనాలి కాబట్టి రాజకీయ నేతలు కొందరు రాజకీయాలు చేస్తున్నారు. కానీ దేశ ప్రజలు ఈ చర్యను ఆదరించారు. ఎక్కడైనా చిన్నచిన్న కష్టాలు ఉంటే సంబంధిత యంత్రాంగం వాటిని పరిష్కరిస్తుంది. ఈ ధన ప్రవాహం రాజకీయ వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనికారణంగా ప్రజల అభిప్రాయం సరిగ్గా వ్యక్తంకావడం లేదు. రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గుతుంది..’ అని పేర్కొన్నారు.