పిల్‌ విచారణలో తీవ్ర వ్యాఖ్యలొద్దు: సుప్రీంకు కేంద్రం హితవు | Govt Hits Back, Asks Supreme Court Judges to Refrain from Making Comments | Sakshi
Sakshi News home page

పిల్‌ విచారణలో తీవ్ర వ్యాఖ్యలొద్దు

Published Thu, Aug 9 2018 5:20 AM | Last Updated on Sun, Sep 2 2018 5:36 PM

Govt Hits Back, Asks Supreme Court Judges to Refrain from Making Comments - Sakshi

న్యూఢిల్లీ: ప్రజాహిత వాజ్యాల (పిల్‌)ను విచారించే సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం హితవు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, జడ్జీలూ ఈ దేశ పౌరులేననీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో జడ్జీలకు తెలుసునని స్పష్టం చేసింది. అయినా తామేమీ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ విమర్శించడం లేదనీ, ముందు  చట్టం ప్రకారం ప్రభుత్వం నడచుకోవాలని కోర్టు సూచించింది. దేశంలోని 1,382 జైళ్లలో ఖైదీల పరిస్థితి అమానవీయంగా ఉందంటూ దాఖలైన పిల్‌పై ధర్మాసనం విచారణ జరుపుతుండగా, అటార్నీ జనరల్‌ (ఏజీ) వేణుగోపాల్, జడ్జీల మధ్య ఈ సంభాషణ జరిగింది. ఏజీ మాట్లాడుతూ ‘నేను సుప్రీంకోర్టును విమర్శించడం లేదు.  కానీ గతంలో సుప్రీం∙తీర్పులతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు’ అని అన్నారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై తీర్పు, రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదంటూ ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు.

లక్షన్నర కోట్లతో ఏమైనా చేయొచ్చుగా..
ఏజీ వ్యాఖ్యలకు న్యాయమూర్తులు స్పందిస్తూ ‘ మా తీర్పుల వల్ల కొన్ని ఉద్యోగాలు పోయుండొచ్చు. మా తీర్పుల వల్లే ప్రభుత్వానికి దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దాంతో మీరేమైనా చేయొచ్చుగా? నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన 30 వేల కోట్ల రూపాయలతో మీరు వాషింగ్‌ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు కొన్నారు’ అంటూ మండిపడ్డారు. కాగా, జైలు సంస్కరణలపై రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో కమిటీ నియమిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. జైళ్లలో పెరుగుతున్న ఖైదీల రద్దీ సహా ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుందని వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement