శని గుడిలోకి రానివ్వం
మహిళా సంఘం తీరును ఖండించిన గ్రామసభ
♦ నిరసనకారులకు పెరుగుతున్న మద్దతు
అహ్మద్‌నగర్: శని గుడిలోకి మహిళలకు ప్రవేశం కల్పించేది లేదని శని సింగణాపూర్ గ్రామసభ తీర్మానం చేసింది. వివాదం చేసేందుకు ‘భూమాత’ మహిళా సంఘం ప్రయత్నించిందంటూ.. సంఘం సభ్యుల తీరును తీవ్రంగా ఖండించింది. రిపబ్లిక్‌డే నాడు.. శని సింగణాపూర్ గుడిలోకి ప్రవేశించేందుకు వెళ్లిన 400 మంది మహిళలను మహారాష్ట్ర పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. వివాదంపై తృప్తి దేశాయ్ నేతృత్వంలోని మహిళా సంఘం నేతలు బుధవారం పుణేలో సీఎం ఫడ్నవిస్‌ను కలిశారు. సీఎం సానుకూలంగా స్పందించారని దేశాయ్ తెలిపారు. తన భార్యతో కలసి గుడిని సందర్శించి.. మహిళల మనోభావాలు కాపాడాలని సీఎంను కోరామన్నారు.
కాగా, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈ మహిళా సంఘాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ వీరి చర్యను సమర్థించగా.. ఎన్డీఏ మిత్రపక్షం ఎల్జేపీ కూడా లింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రకటన చేసింది. సమాన హక్కుల కోసం పోరాడుతున్న మహిళలకు పార్టీ మద్దతుంటుందని.. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ తెలిపారు. ఇలాంటి గొప్ప మార్పునకు సమాజమంతా ఏకమవ్వాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ త్రివేది ఢిల్లీలో తెలిపారు. ఎన్డీఏ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ కూడా శని సింగణాపూర్ దేవాలయ కమిటీ తీరును వ్యతిరేకించింది. బహిరంగ ప్రదేశాల్లో కుల, మత, లింగ వివక్ష ఉండకూడదని.. కేంద్ర మంత్రి పాశ్వాన్ అన్నారు.