20 లక్షలు దాటితేనే జీఎస్‌టీ
ఏకాభిప్రాయంతో ఆమోదించిన జీఎస్టీ మండలి
* కోటిన్నర టర్నోవర్ లోపు సంస్థలపై రాష్ట్రానికే నియంత్రణాధికారం
* మినహాయింపు జాబితా 300 నుంచి 90కి కుదింపు
* సర్వీస్ టాక్స్‌పై పూర్తి అధికారం కేంద్రానిదే
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుపై కీలకమైన ముందడుగు పడింది. ఏడాదికి రూ. 20 లక్షల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలు, వర్తకులకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభించనుంది. శుక్రవారం జరిగిన జీఎస్టీ మండలి (కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు) రెండోరోజు భేటీలో తీవ్ర చర్చ అనంతరం కేంద్ర, రాష్ట్రాలు ఈ నిర్ణయానికి వచ్చాయి.
ఈశాన్య రాష్ట్రాలతోపాటు పర్వత ప్రాంతాలున్న రాష్ట్రాల్లో మినహాయింపు పరిమితిని రూ. 10 లక్షలుగా నిర్ణయించినట్లు జీఎస్టీ మండలి చైర్మన్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఏడాదికి రూ.1.5 కోట్ల లోపు ఆదాయమున్న సంస్థల వ్యవహారాలన్నీ రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని నిర్ణయించారు. అంతకు మించిన టర్నోవర్ ఉన్న సంస్థల విషయంపై నిర్ణయం తీసుకోలేదు. జీఎస్టీ ప్రారంభ పరిమితి రూ. 25 లక్షలుండాలని కొందరు, 10 లక్షలుగా ఉండాలని మరికొందరు ఆర్థిక మంత్రులు డిమాండ్ చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.5 లక్షలకే పరిమితి విధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. జీఎస్టీకి ఆదాయ పరిమితి, పాలనాపరమైన అధికారాలు, కీలకమైన జీఎస్టీ రేట్లపై ఈ భేటీలో చర్చ జరిగింది. అయితే వీటిపై అక్టోబర్ 17-19 సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని.. శుక్రవారం నాటి సమావేశంలో అన్ని నిర్ణయాలపై ఏకాభిప్రాయం వచ్చిందని జైట్లీ చెప్పారు.
రాష్ట్రాలకు మేలు చేసేలా..
ఏప్రిల్ 1, 2017 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ చట్టం ద్వారా రాష్ట్రాలకు ఎక్కువ పరిహారం అందేలా నిబంధనలపైనా జీఎస్టీ మండలి సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రాలకు ఆదాయ పరిహారానికి 2015-16ను బేస్ ఇయర్‌గా పెట్టుకుని.. జీఎస్టీ ద్వారా నష్టం జరిగితే అంత మొత్తాన్ని కేంద్రం అందించనుంది. దీనిపై 3-4 ప్రత్యామ్నాయాలు చర్చకు వచ్చినా తుది రూపు మాత్రం తర్వాతి సమావేశంలోనే రానుంది. కాగా, ప్రస్తుతం సర్వీస్ టాక్స్ చెల్లింపు నిమిత్తం నమోదు చేసుకున్న 11 లక్షల మంది వ్యాపారుల అసెస్‌మెంట్ వ్యవహారం కేంద్రం పరిధిలోనే ఉంటుంది.
అయితే.. కొత్తగా సర్వీస్ టాక్స్ కోసం నమోదు చేసుకునే వారిని కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజించనున్నారు. సెప్టెంబర్ 30న జరిగే సమావేశంలో జీఎస్టీ అమలు, మినహాయింపులపై పూర్తి స్పష్టత వస్తుందని జీఎస్టీ మండలి చైర్మన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 300 వస్తువులు, సేవలకు మినహాయింపు ఇవ్వాలని ముందు అనుకున్నా.. ఈ జాబితాను 90కి కుదించారు. చిరువ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకే ఆదాయ పరిమితిని రూ. 20లక్షలుగా నిర్ణయించినట్లు పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు. కాగా, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్రాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ముఖ్యంగా పరిహారం విషయంలో కేంద్రం ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉన్నట్లు వెల్లడించాయి.