
‘గూఢచర్యం’పై దద్దరిల్లిన సభలు
- ఎస్‌పీజీ భద్రత ఉన్న రాహుల్ వివరాలను ఎందుకు సేకరించారు?: ఆజాద్
- విపక్ష నేతలు, జడ్జీల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది: ఆనంద్‌శర్మ
- ప్రభుత్వ వివరణతో తృప్తి చెందని విపక్షాలు, రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు సోమవారం పార్లమెంటులో తీవ్రస్థాయిలో నిరసనలకు దిగాయి. అయితే.. చిన్నపాటి పుట్ట కూడా కాని దానిని పెద్ద పర్వతంలా చూపేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రభుత్వం వాటి ఆరోపణను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. రాజ్యసభలో 267వ నిబంధన కింద సభా కార్యక్రమాలను రద్దు చేసి ఈ అంశంపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ తిరస్కరించారు. దీనికి విపక్ష సభ్యులు నిలుచుని నిరసనలు వ్యక్తంచేశారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. రాహుల్ తండ్రి రాజీవ్‌గాంధీ ప్రధాని అయినప్పటి నుంచీ రాహుల్ ఎస్‌పీజీ భద్రతలో ఉన్నారని పేర్కొన్నారు. కానీ పోలీసులు ఇప్పుడు మాత్రమే రాహుల్ వాడే బూట్ల సైజు, జుట్టు రంగు, అలవాట్లు, ఆయన సహచరులు, స్నేహితులు, సహాయకుల గురించిన సమాచారాన్ని సేకరించటం ఎందుకో అంతుచిక్కని విషయమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇతరుల టెలిఫోన్లను ప్రభుత్వం దిగుమతి చేసుకున్న పరికరాల ద్వారా ట్యాప్ చేస్తోందని ఆరోపించారు.
ఈ గూఢచర్యం అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపై గూఢచర్యానికి, నిఘాకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ సత్యవ్రత్ చతుర్వేది, ఎస్‌పీ నేతలు నరేశ్ అగర్వాల్, రామ్‌గోపాల్‌యాదవ్, జేడీయూ నేత కేసీ త్యాగి తదితరులు కూడా ఆరోపణలు చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయ ప్రత్యర్థులపై గూఢచర్యానికి పాల్పడటం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం గుజరాత్ నమూనా పాలనను అమలుచేస్తోందని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యంలో ఇలా ఎన్నడూ జరగలేదన్నారు. విపక్షాల ఆరోపణలకు రాజ్యసభ నాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఉభయసభల్లోనూ సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో నివసిస్తున్న వీఐపీలకు పారదర్శక భద్రత కోసం వారి వ్యక్తిగత వివరాలను ఢిల్లీ పోలీసులు 1987 నుంచీ ఒక నమూనా రూపంలో సేకరిస్తున్నారన్నారు.
ఆ ప్రొఫార్మాలో ఏముంటుంది?
వేసుకునే దుస్తులు, తొడుక్కునే బూట్లు, సహచరులు, ఏదైనా అవకరం,ప్రత్యేక లక్షణం, ప్రత్యేక గుర్తింపు గుర్తులు, మారు పేర్లు.. ఇవి రాహుల్ వ్యక్తిగత వివరాలకు సంబంధించి పోలీసులు సేకరించాలనుకున్న వివరాల్లో కొన్ని. ఈ ప్రశ్నలతో 2 పేజీల నమూనా పత్రం ఉంటుంది. దీన్ని సబ్-ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి పూరిస్తారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ ఉప ప్రధాని అద్వానీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకు సంబంధించి ఈ పత్రాలనే పూరించారు. వాజపేయికి సంబంధించిన ప్రొఫార్మాలో.. ఆయన హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం మాట్లాడతారని. పెళ్లి చేసుకోలేదని ఉంది. అద్వానీకి మీసాలు ఉంటాయని, సుష్మాస్వరాజ్ చీర, శాండల్స్ ధరిస్తారని, బొట్టు పెట్టుకుంటారని ఉంది.