
మృతుడు శ్రవణ్ కుమార్ కుటుంబీకులు
ముంబై: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనంతరం వ్యాపారి మృతి చెందిన కేసులో వైద్యుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. రోగి తన అనారోగ్య స్థితిని చెప్పినప్పటికీ వైద్యులు సరిగా పట్టించుకోలేదని నివేదికలో పొందుపరిచింది. వ్యాపారి మరణానికి వైద్యుల నిర్లక్ష్యంతోపాటు నర్సింగ్ హోంను బాధ్యులుగా చేర్చుతూ ప్రముఖ జేజే ఆసుపత్రి నివేదికను వెల్లడించింది. వివరాలు.. ముంబైకి చెందిన వ్యాపారి శ్రవణ్ కుమార్ చౌదరి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం డెర్మటాలజిస్ట్ డా. వికాస్ హల్వాయ్‌ను సంప్రదించాడు. ఈ క్రమంలో శ్రవణ్‌కు మార్చి 7న ఒకే సిట్టింగ్‌లో 9వేలకు పైగా వెంట్రుకలను ట్రాన్స్‌ప్లాంట్ చేశాడు. అనంతరం శ్రవణ్ మెడనొప్పితో అనారోగ్యం పాలవగా వెంటనే గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లాడు. కానీ గ్లోబల్ ఆసుపత్రి అతడిని చేర్చుకోడానికి నిరాకరించింది. దీంతో అక్కడి నుంచి దాల్వీ నర్సింగ్ హోంను ఆశ్రయించాడు.
కానీ శ్రవణ్‌ను నర్సింగ్ హోంలో చేర్చుకున్న కొద్ది గంటలకే డిశ్చార్జి చేసి పంపించేశారు. దీంతో రోగి కోలుకోకపోగా మరింత జబ్బుపడ్డాడు. అతని మొహం, భుజాలపై వాపు రావడంతోపాటు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. శ్రవణ్ కుటుంబ సభ్యులు అతడిని హీరానందని ఆసుపత్రికి తరలించగా, మరుసటి రోజు(డిసెంబర్ 9న) మృతి చెందాడు. దీంతో పోలీసులు శ్రవణ్‌ది ఆకస్మిక మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై ప్రముఖ జేజే ఆసుపత్రి వైద్యుల బృందంతో నిపుణుల కమిటీని వేయగా వారు గురువారం నివేదికలోని అంశాలను వెల్లడించారు. శ్రవణ్ కుమార్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత అనారోగ్యం పాలయ్యాడని ఆ సమయంలో అతనికి మెరుగైన వైద్యం అందించాల్సిందని అభిప్రాయపడింది. అతని మృతికి డెర్మటాలజిస్ట్ వికాస్ హల్వాయ్‌తోపాటు నిర్లక్ష్యం ప్రదర్శించిన నర్సింగ్ హోం వైద్యులను ప్రధాన కారకులుగా పేర్కొంది. కాగా శ్రవణ్ మృతికి కారకులైనవారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ శ్రవణ్ కుమార్ సోదరుడు శివ్ కరణ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment