డెహ్రడూన్: చనిపోయిన ఓ వ్యక్తికి భార్యనంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు మహిళలు ఆస్పత్రికి వచ్చిన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. హరిద్వార్, రిషికూల్ ప్రాంతానికి చెందిన ఓ లారీ డ్రైవర్ ఆదివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన అతడి భార్య స్థానికులు సాయంతో సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ.. సదరు లారీ డ్రైవర్ మృతి చెందాడు. అతడు సోమవారం ఉదయం 4 గంటలకు చనిపోయాడు. అతడితో పాటు వచ్చిన మహిళ ముందుగానే భార్యను అని చెప్పుకుంది. ఆ తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి మరో నలుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు తాము లారీ డ్రైవర్ భార్యలమంటూ ఆస్పత్రికి వచ్చారు.
మృతదేహాన్ని తమకు అప్పగిస్తే.. అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో గందరగోళం ఏర్పడింది. దాంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు మహిళలను ఒక్కొక్కరిని పిలిచి విచారించగా వారంతా సదరు లారీ డ్రైవర్‌కు భార్యనని తెలిపారు. దాంతో పోలీసులు మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించాల్సిందిగా కోరారు. తమ దగ్గర అలాంటివి ఏం లేవన్నారు. అంతేకాక అంత్యక్రియలు నిర్వహించడం కోసం మృత దేహాన్ని తమకు అప్పగించమంటూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. దాంతో ఈ సారి తల పట్టుకోవడం పోలీసుల వంతయ్యంది.
చివరకు ఐదుగుర్ని కలిసి చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా పోలీసులు సూచించారు. అందుకు ఆ మహిళలు కూడా అంగీకరించిడంతో.. పోలీసులు లారీ డ్రైవర్ మృతదేహాన్ని వారికి అప్పగించారు. దాంతో సమస్య పరిష్కారమయ్యింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే లారీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment