50 ఏళ్లొచ్చినా యువనేతనా?
బృందావన్ (ఉత్తరప్రదేశ్): కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 50 ఏళ్లకు సమీపంగా వచ్చినా ఇప్పటికీ ఆయన తాను యువనేతనంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
'ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన దాదాపు 50 ఏళ్లకు చేరువగా ఉన్నాడు. అయినా యువనేతగా చెప్పుకొని తిరుగుతాడు' అని స్మృతి పరోక్షంగా రాహుల్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. తన తల్లి ఆశీస్సులతో రాహుల్ దాదాపు 10 ఏళ్లు ఎంపీగా ఉన్నా.. తన అమేథి నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. బృందావన్‌లో బీజేపీ యువమోర్చా కార్యాక్రమంలో స్మృతి ప్రసంగిస్తూ రాహుల్‌లాగా తాను ఎప్పుడూ మాట్లాడలేదని, తన రక్తంలో జాతీయవాదం ప్రవహిస్తున్నదని పేర్కొన్నారు. తన పనులు మాట్లాడుతాయని, తాను కాదని అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నవారిని విపక్షాలు ప్రశంసిస్తున్నాయని మండిపడ్డారు. సింగూర్‌లో దళిత బాలికను వామపక్ష కార్యకర్తలు రేప్ చేసినప్పుడు, 1999లో కేరళలో తరగది గదిలోనే బీజేపీ కార్యకర్తను నరికి చంపినప్పుడు ఈ పార్టీలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు.