చెన్నై: ఉపాధ్యాయలోకం నివ్వెరపోయే ఘటన ఒకటి సోమవారం తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగింది. ఓ ఉపాధ్యాయురాలిపై ప్రధానోపాధ్యాయురాలు యాసిడ్ దాడికి పాల్పడింది. చెన్నై వలసరవాక్కంలో సియోన్ కిడ్స్ పార్క్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మంజూసింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సోమవారం పాఠశాలకు వెళ్లింది.
ఆ సమయంలో ప్రధానోపాధ్యాయురాలు ఫ్లోరాకు ఆమెకు మధ్య వాగ్వాదం చోట చేసుకుంది. దీంతో ఫ్లోరా అకస్మాత్తుగా మంజూసింగ్పై యాసిడ్ పోసేసింది. తీవ్రగాయాల పాలైన ఆమెను పాఠశాల సిబ్బంది ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఫ్లోరాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.