
విద్యార్థినిపై హెచ్‌ఎం పలుమార్లు అత్యాచారం
కొరాపుట్(ఒడిశా): మాయ మాటలు చెప్పి పదో తరగతి విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(57) పదో తరగతి తరగతి బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. గత మార్చి 19న విద్యార్థినిని తన గదికి రప్పించుకున్నాడు. అప్పటినుంచి బాలికపై పలుమార్లు అత్యాచారం చేస్తున్నాడు.
అదేరోజు తమ కూతురు కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రులు పొట్టంగీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన తాము హెచ్‌ఎం మీద అనుమానం వచ్చి అతడి ఫోన్‌కాల్స్ ఆధారంగా ట్రేస్ చేసి బాలికను సోమవారం గుర్తించినట్లు ఇన్ స్పెక్టర్ దేవ్ గమాంగ్ తెలిపారు. ఈ మేరకు హెచ్‌ఎంను అదుపులోకి తీసుకుని పలు సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, హెచ్‌ఎం తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. వైద్య పరీక్షల నిమిత్తం ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ నీచానికి ఒడిగట్టిన హెచ్‌ఎంను సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.