
జమ్మూలో నరేంద్ర మోడీ ర్యాలీకి భారీ భద్రత
జమ్మూలో ఆదివారం జరిగే బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ ర్యాలీకి అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. ర్యాలీ వేదిక ఎంఏ స్టేడియం చుట్టూ భద్రత బలగాలు పహారా కాస్తున్నాయి. ఇక్కడ ఎలాంటి అనధికారిక కార్యక్రమాలు జరగకుండా నిషేధం విధించారు. రెండు రోజుల ముందు గుజరాత్ పోలీసులు మోడీ భద్రతను సమీక్షించారు. శనివారం వేదిక వద్ద స్థానిక పోలీసులు, సీఆర్ఎఫ్ సిబ్బంది ముందస్తుగా డ్రిల్ నిర్వహించారు.
మోడీ ర్యాలీని దృష్టిలో ఉంచుకుని జమ్మూకాశ్మీర్ రాష్ట్రమంతటా స్థానిక పోలీసులు, సీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. భద్రత చర్యల్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జమ్మూకు వెళ్లే అన్ని రహదారుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్మీ సిబ్బంది స్థానిక పోలీసులకు సాయపడుతున్నారు. ర్యాలీలో మోడీతో పాటు బీజేపీ నాయకులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొంటారు.