హిజ్రాల పెళ్లి సందడి.. అందాల పోటీలు | Hijras Koovagam Festival In Tamil Nadu | Sakshi
Sakshi News home page

హిజ్రాల పెళ్లి సందడి.. అందాల పోటీలు

Published Wed, Apr 17 2019 8:06 AM | Last Updated on Wed, Apr 17 2019 8:30 AM

Hijras Koovagam Festival In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: కూవాగంలో మంగళవారం హిజ్రాల వసంతోత్సవం కోలాహలంగా సాగింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన హిజ్రాలు కూత్తావండర్‌ ఆలయ పూజారుల వద్ద తాళి కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగారు. ఇక, మిస్‌కూవాగం–2019గా ధర్మపురికి చెందిన నబీషా ఎంపికయ్యారు. విల్లుపురం జిల్లా ఉలందూరుపేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువై ఉన్న కూత్తాండవర్‌ హిజ్రాల ఆరాధ్యుడు. ఇక్కడ ప్రతి ఏటా చైత్రమాసంలో సాగే ఉత్సవాలు హిజ్రాలకు వసంతోత్సవమే. ఇక్కడి వేడుకకు  మహాభారత యుద్ధగాథ ముడిపడి ఉందని పురాణాల్లో పేర్కొన బడి ఉన్నాయి. ఆ మేరకు మోహినీ అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడిని వివాహమాడిన ఐరావంతుడిని తమ ఆరాధ్యుడిగా హిజ్రాలు కొలుçస్తున్నారు. ఇక్కడ కొలువుదీరిన ఐరావంతుడి ఆలయంలో ఉత్సవాలు ఈ నెల రెండో తేదీన ఆరంభమైంది.  ప్రతిరోజూ ఆలయంలో వైభవంగా విశిష్ట పూజలు జరుగుతూ వస్తున్నాయి. అలాగే, మహాభారత గాథను వివరిస్తూ నాటకం, హరికథా  ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

పెళ్లి వేడుక:
ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి. అత్యంత వేడుకగా జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున హిజ్రాలు ఇక్కడికి తరలి రావడం జరుగుతోంది. అయితే, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హిజ్రాల రాక కాస్త తగ్గిందని చెప్పవచ్చు.  మంగళవారం జరిగిన పెళ్లి వేడుక కోసం తరలి వచ్చిన హిజ్రాలతో ఆ పరిసరాలు సందడి వాతావరణంలో మునిగాయి. అందగత్తెలకు తామేమి తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని వచ్చిన హిజ్రాలను చూడడానికి పరిసర గ్రామాల ప్రజలు పొటెత్తారు. హిజ్రాల పెళ్లి సందడి నిమిత్తం ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున దుకాణాలు వెలిశాయి.  ప్రధానంగా పక్క రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి హిజ్రాల రాక తగ్గినా, తమిళనాడులోని తిరునల్వేలి, కోయంబత్తూరు, చెన్నై, సేలం, విల్లుపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలోనే తరలివచ్చారు.

సోమవారం అంతా ఆటపాటలు, ఫ్యాషన్‌ షోలు అంటూ సందడి చేసిన హిజ్రాలు మంగళవారం ఉయం నుంచి పెళ్లికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, తాళిబొట్లను కొనుగోలు చేశారు.  సాయంత్రం కొత్త పెళ్లి కూతుళ్ల వలే ముస్తాబైన హిజ్రాలు కూత్తాండవర్‌ ఆలయం వద్దకు చేరుకోనున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా తాళిబొట్టు కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. తాళి కట్టించుకున్న ఆనందంలో నృత్యం చేస్తూ ముందుకు సాగిన వాళ్లు కొందరు అయితే, తమ మిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకున్న వాళ్లు మరెందరో. రాత్రంతా అక్కడి మైదానంలో ఆనంద తాండవం చేసిన హిజ్రాలు, బుధవారం ఉదయాన్నే జరిగే కూత్తాండవరన్‌ ఆలయ రథోత్సవం, బలిదానం తదుపరి వితంతువులుగా మారనున్నారు.

మిస్‌ కూవాగంగా నబీషా:

అందగత్తెలకు, మోడల్స్‌కు తామేమి తీసి పోమన్నట్టుగా ఇక్కడ సోమవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మిస్‌ కూవాగం పోటీలు జరిగాయి. పలు సంస్థల నేతృత్వంలో మిస్‌కూవాగం పోటీలతో పాటు హిజ్రాల ప్రతిభను చాటే విధంగా పోటీలు సాగాయి. ఈ పోటీల్లో  అందగత్తెలకు ఏ మాత్రం తాము తీసి పోమన్నట్టుగా, ప్రతిభలో తాము సత్తా చాటుతామన్నట్టుగా హిజ్రాలు ర్యాంప్‌పై వయ్యారాలు ఒలక బోస్తూ క్యాట్‌వాక్‌ చేశారు. నృత్య ప్రదర్శనలతో ఆహూతుల్ని అలరించారు. విల్లుపురం, తిరునల్వేలి, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, చెన్నై జిల్లాలకు చెందిన 36 మంది హిజ్రాలు మిస్‌ కూవాగం –2019 కిరిటాన్ని తన్నుకెళ్లేందుకు పోటీ పడ్డారు. అన్ని రకాల పోటీల అనంతరం చివర్లో ఎయిడ్స్‌ అవగాహన, సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ  అంశాలపై ప్రశ్నల్ని సంధించి, విజేతను ఎంపిక చేశారు. ఆ మేరకు ధర్మపురికి చెందిన నబీషా అనే హిజ్రా మిస్‌ కూవాగం –2019 కిరీటాన్ని కైవసం చేసుకుంది. అలాగే, రెండో స్థానాన్ని మడోనా(కోయంబత్తూరు), మూడోస్తానం రుద్ర (ఈరోడ్‌ భవానీ) దక్కించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement