మన్సుఖ్ లాల్ మాండవీయ, నితిన్ పటేల్, విజయ్ రూపానీ, జైరామ్ ఠాకూర్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్/సిమ్లా: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించినా.. ముఖ్యమంత్రుల ఎంపిక ఆ పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. బీజేపీ గెలిస్తే.. గుజరాత్‌లో ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రేమ్ కుమార్ ధూమల్‌లు సీఎంలు అవుతారని ఆ పార్టీ ముందుగానే ప్రకటించింది. అయితే గుజరాత్‌లో అత్తెసరు మెజార్టీతో గెలవడం, హిమాచల్‌లో ఏకంగా సీఎం అభ్యర్థే ఓడిపోవడంతో కొత్త ముఖ్యమంత్రుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ సీఎం రేసులో ప్రస్తుత సీఎం విజయ్ రూపానీతో పాటు కేంద్ర సహాయ మంత్రి మన్సుఖ్ లాల్ మాండవీయ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, ప్రస్తుత కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేర్లు వినిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జైరాం ఠాకూర్, అజయ్ జమ్వాల్, కేంద్ర మంత్రి నడ్డాలు రేసులో ఉన్నారు.
సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ నేతృత్వంలోనే గుజరాత్ ఎన్నికల్లో తలపడుతున్నామని ప్రచారంలో బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. అయితే బీజేపీ అనుకున్నన్ని స్థానాలు గెలవకపోవడంతో.. ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ నాయకత్వం యోచిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ, పార్టీ పార్లమెంటరీ బోర్డుదే తుది నిర్ణయమని ఆ వర్గాలు తెలిపాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు రూపానీ స్పందిస్తూ.. ‘ఈ ఎన్నికల్లో నా పేరిట బీజేపీ పోరాడింది. అయితే ముఖ్యమంత్రి ఎంపికపై పార్టీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలకు గాను పటీదార్ వర్గం నుంచి 47 మంది ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వారికి సీఎం పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పటేల్ వర్గానికి చెందిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ లాల్ మాండవీయ, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ పేర్లు విన్పిస్తున్నాయి. ఈ నిర్ణయంతో హార్దిక్ పటేల్‌కు కూడా చెక్ పెట్టవచ్చనే ఆలోచనలో ఉంది. సీఎం రేసులో పటేల్ వర్గానికి చెందిన సీనియర్ నేత, కర్ణాటక గవర్నర్ వజుభాయ్‌వాలా పేరు కూడా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేరు తెరపైకి వచ్చినా.. పార్టీ వర్గాలు మాత్రం స్పందించలేదు.
నేడు గుజరాత్‌కు జైట్లీ
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని పరిశీలక బృందం నేడు గుజరాత్‌కు వెళ్లనుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో విస్తృతంగా చర్చించి ముఖ్యమంత్రి పేరుపై ఏకాభిప్రాయానికి ప్రయత్నించనుంది. అనంతరం ఎమ్మెల్యేల నిర్ణయాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు తెలియచేస్తుంది. కాగా గుజరాత్‌లో డిసెంబర్ 25న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ పుట్టినరోజు కావడంతో ఆ రోజునే ప్రమాణ స్వీకారం ఉంటుందని భావిస్తున్నారు.
హిమాచల్‌లో జైరామ్ ఠాకూర్ ముందంజ
హిమాచల్ ప్రదేశ్‌లో సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధూమల్ ఓటమితో సీఎం ఎంపిక పార్టీ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. ధూమల్ ఓటమితో ఆయనకు దారులు పూర్తిగా మూసుకుపోయాయి. హిమాచల్‌లో 35% ఓటర్లు రాజ్‌పుత్ వర్గానికి చెందిన వారే. ఈ నేపథ్యంలో ఆ వర్గానికే చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జైరామ్ ఠాకూర్ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. మరో రాజ్‌పుత్ నేత అజయ్ జమ్వాల్ పేరు కూడా విన్పిస్తోంది. కేంద్ర అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కూడా అవకాశముందని భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల నుంచే సీఎం అభ్యర్థిని ఎంపిక చేయవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నడ్డా బ్రాహ్మణ వర్గ నేత కావడంతో ఆయనకు అవకాశం లేదని చెబుతున్నారు. అలాగే ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన మొహిందర్ సింగ్, మరో సీనియర్ నేత రాజీవ్ బిందాల్, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సురేశ్ భరద్వాజ్, మరో నేత క్రిష్ణన్ కపూర్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్‌లను పార్టీ పరిశీలకులుగా బీజేపీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment