బియాస్లో మరో రెండు మృతదేహాలు లభ్యం
మండి : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల్లో బుధవారం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. సంఘటన జరిగి 11 రోజుల తర్వాత పండో రిజర్వాయర్ దగ్గర ఈ మృతదేహాలు బయటపడ్డాయి. గత రాత్రి నుంచి పండో రిజర్వాయర్ వద్ద భారీ వర్షం పడటంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
బయటపడిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు ఎవరిదన్నది గుర్తించాల్సి ఉంది. కాగా ఇప్పటివరకూ పది మృతదేహాలు లభ్యం అయ్యాయి. విహార యాత్రకు వెళ్లిన వీఎన్నార్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. లభ్యమైన మృతదేహాలను హిమాచల్ ప్రదేశ్ అధికారులు హైదరాబాద్ పంపనున్నారు.