ఉడిపి క్షేత్రంలో జరుగుతున్న ధర్మసన్సద్ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో చర్చిస్తున్న స్వామీజీలు
సాక్షి, ఉడిపి : ప్రతి హిందువు నలుగురు పిల్లలను కనాలంటూ హరిద్వార్ పీఠాధిపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని ఉడిపి క్షేత్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్మ సన్సద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో కామన్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చే వరకు.. ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలని.. హరిద్వార్ పీఠాధిపతి స్వామీ గోవింద్‌దేవ్ గిరిరాజ్ మహరాజ్ శనివారం పిలుపునిచ్చారు. అలా చేయడం వల్లే జనాభాను సమతుల్యంగా ఉంచడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఇద్దరు పిల్లల విధానం వల్ల హిందువుల జనాభా దేశంలో తగ్గు ముఖం పడుతోందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఇద్దరు పిల్లల విధానాన్ని అందరికీ వర్తింపచేయాలని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడైతే హిందువుల జనాభా తగ్గిందో.. ఆ ప్రాంతాన్ని భారత్ కోల్పోయిందని, ఇందుకు జనాభా అసమతుల్యతే కారణమని ఆయన చెప్పారు.
గోవులను రక్షించుకోవడం హిందువుల బాధ్యత అని ఆయన చెప్పారు. అదే సమయంలో గోవుల రక్షణ కోసం శ్రమిస్తున్న గో రక్షక్‌లను ఆయన కొనియాడారు. నేడు కొంతమంది గో రక్షక్‌లను నేరస్తులుగా చూస్తున్నారని.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గో రక్షక్‌లు అత్యంత శాంతి ప్రియులని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment