హిందువులకూ ఓ పవిత్ర గ్రంథం
న్యూఢిల్లీ: హిందూ మతానికి కూడా ఓ పవిత్ర గ్రంధాన్ని సృష్టించేందుకు విశ్వహిందూ పరిషద్ భారీ కసరత్తు ప్రారంభించింది. ఒకే ఒక పవిత్ర గ్రంధం కలిగిన ఇస్లాం, క్రైస్తవ మతాల నుంచి ఎదురవుతున్న ముప్పును తప్పించుకోవడానికి, ఆయా మతాల్లోకి మారిన వారిని ‘ఘర్ వాపసీ’ స్కీమ్ కింద వెనక్కి రప్పించేందుకు ఈ కసరత్తు అవసరమని వీహెచ్‌పీ భావిస్తోంది. కులాలు, ఉప కులాలకు అతీతంగా హిందువులందరిని ఏకతాటిపైకి తీసుకరావడానికి ఏకరీతి ఆధ్యాత్మిక విలువులు ఉండాలనే ఉద్దేశంతో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సూచన మేరకు ఈ కసరత్తును ప్రారంభించామని వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు జీవేశ్వర్ మిశ్రా ఇటీవల ఓ స్థానిక మీడియాకు తెలిపారు.
భగవద్గీత, స్మృతులు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలన్నింటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిలో నుంచి హిందువులు తప్పక ఆచరించాల్సిన అంశాలను క్రోడీకరించి ఓ పవిత్ర గ్రంధం రూపొందించడం కోసం వీహెచ్‌పీ కసరత్తు ప్రారంభించింది. మోహన్ భగవత్ సూచన మేరకు వీహెచ్‌పీ ఉపాధ్యక్షులు మిశ్రాతోపాటు జగన్నాథ్ సాహి, జాతీయ కార్యదర్శి ధర్మనారాయణ శర్మ, భారత్ సాంస్కృత్ పరిషద్ (వీహెచ్‌పీ అనుబంధ సంఘం) జనరల్ సెక్రటరీ ఆచార్య రాధా కృష్ణ మనోరి ఈ కసరత్తు బాధ్యతలను స్వీకరించారు. యజ్ఞవల్క స్మృతిని మిశ్ర అధ్యయనం చేస్తారు. పరాశర్ స్మృతి, మనుస్మృతి, మహాభారత్‌లను సాహి, మనోరి, శర్మలు అధ్యయనం చేస్తారు.
గత ఆగస్టు నెలలో ఢిల్లీలో సమావేశమైన ఈ నలుగురు మళ్లీ అక్టోబర్ మొదటివారంలో ఢిల్లీలోనే సమావేశం కావాలని నిర్ణయించారు. భగవద్గీత, మనుస్మృతి హిందువులకు పవిత్రమైనప్పటికీ అవి హిందువులందరిని ఏకతాటిపై నడిపించలేకపోతున్నాయని, అందుకనే హిందువులకు కూడా ఓ పవిత్ర గ్రంధం తీసుకరావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఓ ఆరెస్సెస్ నాయకుడు స్థానిక మీడియాతో చెప్పారు. దీనివల్ల ఇస్లాం, క్రైస్తవ మతాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడమే కాకుండా హిందూ మతానికి కూడా బలమైన పునాదులు ఏర్పడతాయని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని సదరు నాయకుడు వ్యాఖ్యానించారు.
వాస్తవానికి హిందువుల విశ్వాసాలను తిరగరాయడానికి ఆరెస్సెస్ ఎప్పటి నుంచే ప్రయత్నిస్తోంది. శూద్రులను అంటరాని వారిగా హిందువులు ఎప్పడు చూడలేదని, ముస్లింల దురాక్రమణల కారణంగానే వారు అంటరాని వారయ్యారంటూ ప్రచారం మొదలు పెట్టడమే కాకుండా కొన్ని పుస్తకాలను కూడా ప్రచురించింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడంతో హిందూ పవిత్ర మత గ్రంధం కోసం కసరత్తును వేగవంతం చేసింది.
వివిధ స్మతులు, హిందూ గ్రంధాలపై అధ్యయనం చేస్తున్న నలుగురు నేతలు చిత్తు ప్రతినే తయారు చేస్తారని, ఆ ప్రతిని చర్చ కోసం సీనియర్ వీహెచ్‌పీ, ఆరెస్సెస్ నేతల ముందు పెడతారని మిశ్రా తెలిపారు. ఆ తర్వాత దశలో సంస్కృత భాష, మత విద్యావేత్తల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని చెప్పారు. చివరగా సదస్సుల్లో విస్తృతంగా చర్చించి తుది గ్రంధాన్ని రూపొందిస్తామని ఆయన తెలిపారు. హిందూ అనేది ఓ మతం కాదని, అదొక జీవన విధానం అంటూ వాదిస్తూ వస్తున్న బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి!