
శ్రీ నగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌లోని నవకాడల్ ఏరియాలో హిజ్బుల్ మొజాహిద్దీన్ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు సోమవారం రాత్రి స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా మంగళవారం తెల్లవారుజామున నవకాడల్ ఏరియాలో ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో జవాన్లు ఎదురుకాల్సులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది హతమయ్యాడని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు.