
పరువు పోతుందని...
మైసూరు (కర్ణాటక): మైసూరు జిల్లా, కే.ఆర్.నగర్ తాలూకా, నాడప్పన హళ్లిలో జరిగిన పరువు హత్య ఏడాది తర్వాత వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. నాడప్పనహళ్లికి చెందిన పుట్టరాజు శెట్టి, లీలమ్మల కుమార్తె సునీత(19) అదే గ్రామానికి చెందిన బంధువుల అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆ యువతిని గర్భవతిని చేశాడు. విషయం బయట పడితే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు సునీతను పొలానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా పడేసి వెళ్లారు.
తమ కుమార్తె కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని గ్రామస్థులను నమ్మించారు. అయితే సునీతను తల్లిదండ్రులే హత్య చేశారని గుర్తు తెలియని వ్యక్తులు జిల్లా ఎస్పీకి లేఖ రాయగా, ఆయన విచారణకు ఆదేశించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా సునీత తల్లిదండ్రులను విచారించగా.. తమ కుమార్తె పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో పరువు పోతుందని భావించి తామే హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో ఆదివారం వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2011 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కర్ణాటకాలో 10 పరువు హత్యలు జరిగాయి.