
సాక్షి, ముంబై : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఆయనకు చికిత్స అందిస్తున్న ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆస్పత్రి ఖండించింది. పారికర్ ఆరోగ్యం విషయమై మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, రూమర్లు అన్ని అవాస్తవమేనని, ఆయన చక్కగా చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
సీఎం పారికర్ ఆరోగ్యం గురించి దురుద్దేశంతోనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం విషయంలో వస్తున్న కథనాలు బూటకమని ఆస్పత్రి తీవ్రంగా పేర్కొంది. ‘మాగ్నెటిక్ మహారాష్ట్ర’ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొనేందుకు ముంబై వచ్చిన ప్రధాని మోదీ ఆదివారం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పారికర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంబారిన పడటంతో ఈ నెల 15న పారికర్ లీలావతి ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని గోవా సీఎంవో ఇప్పటికే ప్రకటించింది.