
భవితకు భరోసా!
ఐదు రాష్ట్రాల ఎన్నికలున్నా ఆర్భాటం చూపని ఆర్థికమంత్రి
మూడు నెలల కిందట అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు.. మరో 4 నెలల్లో అమలులోకి రానున్న వస్తుసేవల పన్ను.. అత్యంత కీలకమైన రెండు భారీ ఆర్థిక సంస్కరణల మధ్య కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంతేకాదు.. 92 ఏళ్లుగా వేరుగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్‌ను కూడా కలిపేయడం, బడ్జెట్ తేదీలను నెల రోజులు ముందుకు జరిపి ప్రవేశపెట్టడం ఈ సాధారణ బడ్జెట్‌ను చరిత్రాత్మకం చేస్తోంది. మరో నెల రోజుల్లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు ప్రతిష్టాత్మకమైనది. అంతేకాదు.. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిన పెద్ద నోట్ల రద్దు అనంతరం చేపడుతున్న బడ్జెట్ కనుక.. అంచనాలూ భారీగా పెరిగాయి. అయితే.. 21,46,735 కోట్ల రూపాయలతో 2017–18 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా.. హంగూ ఆర్భాటాల జోలికి వెళ్లలేదు. ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో నిజాయితీపరులైన వారికి ప్రోత్సాహకం అంటూ.. వేతన జీవులకు కింది స్లాబు పన్ను రేటును సగానికి తగ్గించి ఊరట కల్పించారు. చిన్న కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటును ఐదు శాతం తగ్గించడం ద్వారా చేయూతనిచ్చారు.
న్యూఢిల్లీ : వసంత పంచమి రోజున తాను బడ్జెట్ ప్రవేశపెడుతున్నానంటూ బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రసంగం ప్రారంభించిన అరుణ్ జైట్లీ... దేశంలో ‘పాలనా విధానంలో మార్పు’తీసుకురావడం కోసం తమ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా చేసిన కృషిని వివరించారు. ఆ క్రమంలో ‘గత’ప్రభుత్వాలపై పరోక్ష విమర్శలూ గుప్పించారు. వివక్షా పూరిత పరిపాలన నుంచి విధాన ఆధారిత పరిపాలనకు, ఆశ్రిత పక్షపాతం నుంచి పారదర్శకతకు, లోపభూయిష్ట పథకాల నుండి లక్షిత అమలుకు, అనధికార ఆర్థికవ్యవస్థ నుంచి క్రమబద్ధమైన ఆర్థికవ్యవస్థకు పయనించినట్లు చెప్పారు. రెండంకెల్లో ఉన్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించామని, మందకొడిగా ఉన్న వృద్ధిని అధిక వృద్ధితో భర్తీచేశామని పేర్కొన్నారు. నల్లధనంపై భారీ యుద్ధం ప్రారంభించామని.. ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజా ధనానికి నమ్మకమైన కాపలాదారుగా చూస్తున్నారన్నారు. అభివృద్ధి ఫలాలు రైతులు, కార్మికులు, పేదలు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, మహిళలతో పాటు సమాజంలోని అణగారిన వర్గాలకు అందేలా చూడటానికి తాము ఇంకా మరిన్ని చర్యలను చేపట్టడం కొనసాగిస్తామని జైట్లీ చెప్పారు. అభివృద్ధి, ఉపాధి ఫలాలను అందుకునేలా యువతను శక్తివంతం చేయడంపై తమ దృష్టి కేంద్రీకరిస్తామన్నారు.
సవాళ్లున్నా ఉజ్వలమే...
ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి రేటు మెరుగుపడుతుందన్న అంచనాలు.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆశావహంగా ఉంటుందనేందుకు సానుకూల సంకేతాలన్నారు. అయితే.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు మూడు సవాళ్లున్నాయన్నారు. మొదటిది– అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుత ద్రవ్య విధానం కారణంగా పెట్టుబడుల రాక తగ్గడం, పోక పెరగడం జరగవచ్చని చెప్పారు. రెండోది– నిత్యావసరాల ధరల, ప్రత్యేకించి ముడి చమురు ధర అనిశ్చితి ద్రవ్య పరిస్థితిపై ప్రభావం చూపుతుందన్నారు. మూడోది– ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో స్వీయ రక్షణ కోసం ఒత్తిళ్లు పెరగడంతో.. వస్తువులు, సేవలు, ప్రజల ప్రపంచీకరణ నుంచి వెనుదిరగడం పెరుగుతోందని పరోక్షంగా అమెరికాలో ట్రంప్ విధానాల గురించి ప్రస్తావించారు. ఇది ఎగుమతులపై ప్రభావం చూప గలదన్నారు. వీటన్నిటి మధ్యా భారత దేశం ప్రపంచ ఆర్థిక వేదికపై ఉజ్వలంగా నిలుస్తోందంటూ ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక తదితర అంతర్జాతీయ సంస్థల నివేదికలను ఉటంకించారు. ఇంతకుముందు తయారీ దేశాల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు ఆరో స్థానానికి ఎగబాకిందని చెప్పారు. అంతర్జాతీయ వృద్ధికి భారత్‌ను చోదక శక్తిగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు.
నోట్ల రద్దుతో దీర్ఘకాల ప్రయోజనాలు..
తమ ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణల కొనసాగింపుగా పెద్ద నోట్ల రద్దు చేపట్టడం జరిగిందన్నారు. ‘అది సాహసోపేతమైన, నిర్ణయాత్మక చర్య’అని అభివర్ణించారు. పన్ను ఎగవేత అనేది దశాబ్దాలుగా చాలా మందికి జీవన విధానంగా మారిందని.. దీనివల్ల విస్తృత ప్రజాప్రయోజనాలపై రాజీ పడాల్సివస్తోందని పేర్కొన్నారు. అది సమాంతర ఆర్థికవ్యవస్థను పెంచిపోషించిందన్నారు. జీడీపీ మరింత అధికంగా, స్వచ్ఛంగా, వాస్తవికంగా ఉండేందుకు పెద్ద నోట్ల రద్దు దోహదం చేస్తుందని చెప్పారు. అన్ని సంస్కరణల తరహాలోనే ఈ చర్య కూడా అవాంతరాలను కలిగించేదేనన్నారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త నోట్లను మార్కెట్లోకి సరఫరా చేసే కాలంలో ఆర్థిక లావాదేవీలు తగ్గడం.. ఆర్థిక వ్యవస్థపై కేవలం తాత్కాలిక ప్రభావం మాత్రమే చూపుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. ‘ఒక సరైన కారణం ఎన్నడూ విఫలం కాదు’అంటూ మహాత్మా గాంధీ సూక్తిని ఉటంకిస్తూ ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా.. అవినీతి తగ్గుముఖం, ఆర్థిక వ్యవస్థ డిజిటైజేషన్ పెరగడం, ఆర్థిక పొదుపుల ప్రవాహం పెరగడం, ఆర్థిక వ్యవస్థ మరింతగా క్రమబద్ధం కావడం వంటి దీర్ఘ కాల ప్రయోజనాలు లభిస్తాయని.. వీటన్నిటివల్లా జీడీపీ వృద్ధి, పన్ను ఆదాయాలు అధికమవుతాయని వివరించారు.
మౌలికం, గ్రామీణానికి ప్రాధాన్యం...
ఇక దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ బాట పట్టించేందుకు పలు చర్యలు ప్రకటించిన జైట్లీ.. మౌలికవసతుల పథకాలకు రికార్డు స్థాయిలో రూ. 3,96,135 కోట్లు కేటాయించారు. ఈ భారీ పెట్టుబ డులు.. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆర్థిక కార్యక లాపాలను సృష్టిస్తాయని, మరిన్ని ఉద్యోగ అవకా శాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. రైల్వేలకు రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయం, జాతీయ రహదారులకు మరో రూ. 64,000 కోట్లు ఇచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రైతులకు రికార్డు స్థాయిలో రూ. 10 లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులను రూ. 48,000 కోట్లకు పెంచారు. కోటి కుటుంబాలకు పేదరికం నుంచి విముక్తి కల్పించాలని లక్ష్యంగా ప్రకటించారు. 2019 నాటికి ఇళ్లులేని వారికి కోటి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా గ్రామీణ, వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి రూ. 1,87, 223 కోట్లు కేటాయింపులు చేశారు. ఇది ప్రస్తుత ఏడాది కన్నా 24 శాతం అధికం. ఇక రక్షణ రంగానికి, పెన్షన్లను మినహాయించి రూ. 2,74,114 కోట్లు కేటాయించారు. అందులో రూ. 89,488 కోట్లు పెట్టుబడిగా పేర్కొన్నారు. అలాగే.. ప్రభుత్వ బ్యాం కులకు రూ. 10,000 కోట్లు పెట్టుబడులుగా అందిం చనున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000 కోట్లు ఇలా అందించారు.
జైట్లీ బడ్జెట్ షాయరీలివీ..
బడ్జెట్ ప్రవేశపెడుతూ 2 గంటల పాటు ప్రసంగించిన జైట్లీ.. మధ్యలో సందర్భానుసారం షాయరీలతో సభ్యులందరినీ ఆకట్టుకున్నారు.
‘ఇస్ మోడ్ పర్ న ఘబ్రా కర్ థమ్ జాయియే ఆప్.. జో బాత్ నయీ హై ఉసే అప్నాయియే ఆప్.. (ఈ మలుపులో మీరు ఆందోళన చెంది ఆగిపోవద్దు.. ఏది కొత్త విషయమో దానిని మీరు స్వీకరించండి)’
‘డర్తే హై నయీ రాహ్ పే క్యూ చల్నే సె.. హమ్ ఆగే ఆగే చల్తే హై ఆయియే ఆప్... (కొత్త దారిలో నడవడానికి మీకెందుకు భయం.. నేను ముందు నడుస్తా మీరు నా వెంట రండి)
‘నయీ దునియా హై.. నయా దౌర్ హై.. నయీ హై ఉమంగ్.. కుచ్ థే పెహలే కే తరీకే.. తొ కుచ్ హై ఆజ్ కె రంగ్ ధంగ్.. (కొత్త ప్రపంచం.. కొత్త ప్రయాణం.. కొత్త ఆశలు.. కొన్ని పాతవే.. మరికొన్ని ఈనాటివి)’
‘రోష్నీ జో యె నికల్ ఆయీ హై.. కాలే ధన్ కో భీ బదల్నా పడా ఆజ్ అప్నా రంగ్.. (దూసుకొచ్చిన ఈ వెలుగు వల్ల.. నల్ల ధనం కూడా తన రంగు మార్చుకోవాల్సి వచ్చింది)’
జీడీపీ పెరుగుతుంది...
నల్లధనాన్ని నిర్మూలించి, స్వచ్ఛ లావాదేవీలను ప్రవేశపెట్టే ఉద్దేశంతో అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు అనంతరం.. కొత్త నోట్ల విడుదల వేగం పుంజుకుందని, త్వరలో సౌకర్యవంతమైన స్థాయికి చేరుకుంటుందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. నోట్ల రద్దు ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి విస్తరించదని ఆశిస్తున్నట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చి చేరిన అదనపు ద్రవ్య నిల్వల వల్ల.. వడ్డీ భారం తగ్గుతుందని, రుణాల అందుబాటు పెరుగుతుందని వివరించారు. నోట్ల రద్దు కాలంలో బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం.. పన్ను పరిధిని విస్తరించడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలుకల్పిస్తుందన్నారు. అలాగే.. రూ. 3 లక్షలకు మించిన మొత్తంలో నగదు లావాదేవీలను ఈ బడ్జెట్లో నిషేధించారు. రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారదర్శకత పెంపు లక్ష్యంగా.. పార్టీలు ఒక్కో దాత నుంచి నగదు రూపంలో స్వీకరించగల విరాళం మొత్తాన్ని రూ. 20,000 నుంచి ఏకంగా రూ. 2,000 కు తగ్గించారు.
ఇటు కోత.. అటు మోత..
వేతనజీవులకు ఊరటనిస్తూ.. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల స్లాబుపై ఆదాయ పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన జైట్లీ.. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయంపై 10 శాతం సర్ చార్జ్ విధించారు. కోటి రూపాయలు దాటిన ఆదాయంపై 15 శాతం సర్‌చార్జీని కొనసాగించారు. అలాగే.. టర్నోవర్ రూ. 50 కోట్లకు తక్కువగా ఉన్న కంపెనీలపై కార్పొరేట్ పన్నును ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) త్వరలో అమలులోకి వస్తున్నందున.. పరోక్ష పన్నులను పెద్దగా కదిలించలేదు. అయితే.. పొగాకు ఉత్పత్తులు, సోలార్ ప్యానెళ్లు, మొబైల్ ఫోన్లలో వాడే సర్క్యూట్లపై సుంకాలను కొద్దిగా పెంచారు.
పెరిగిన ద్రవ్యలోటు.. తగ్గిన రెవెన్యూ లోటు
బడ్జెట్ కేటాయింపులను ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంగా వేరుచేయడాన్ని విడనాడడం ద్వారా.. ఇప్పుడు పెట్టుబడి, రెవెన్యూ వ్యయాలపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ఏడాది కన్నా తాజా బడ్జెట్లో పెట్టుబడి వ్యయాన్ని 25.4 శాతం పెంచానని, ఇది అధిక వృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా 3.5 శాతంగా ఉన్నట్లు చెప్పారు. అయితే.. 2019 మార్చి నాటికి ఇది 3 శాతానికి తగ్గుతుందని చెప్పారు. అలాగే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో 2.3 శాతంగా ఉన్న రెవెన్యూ లోటు.. సవరించిన అంచనాల్లో 2.1 శాతానికి తగ్గిందని జైట్లీ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ లోటు 1.9 శాతంగా ఉంటుందన్నారు.