
బిల్లొస్తుందని నెల ముందే ఎలా తెలిసింది: నాగం
సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 17, 18 తేదీల్లోనే పార్లమెంటుకు బిల్లు వస్తుందని సీమాంధ్ర నేతలకు ముందే ఎలా తెలిసిందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇంతమంది రావాల్సిన అవసరం ఏముంది? బిల్లు ఈ తేదీల్లోనే వస్తోందని నెల కిందటే సీమాంధ్ర నేతలకు ఎలా తెలిసింది? రైళ్ల బుకింగ్ ఎలా చేయగలిగారు? ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలతో కుమ్మక్కయ్యిందని అర్థమవుతోంది’’ అని నాగం ఆరోపించారు.
హింస ప్రేరేపించేందుకే సీమాంధ్రులు ఢిల్లీ వస్తున్నారని, అవాంఛిత సంఘటన ఏమి జరిగినా కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సీమాంధ్రుల ధర్నాలకు కాంగ్రెస్సే ఏర్పాట్లు చేస్తోందని ఆరోపించారు. సొంతంగా పాస్ చేయించుకునే శక్తి లేని కాంగ్రెస్.. బీజేపీపైన నమ్మకంతోనే బిల్లు తెచ్చిందని, అయితే ప్రవేశ పెట్టిన తీరే జుగుప్సాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. బిల్లుకు వ్యతిరేకమని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు. మంత్రి జైరాం రమేశ్ ఓ జాతీయ చానెల్ ఇంటర్వ్యూలో గందరగోళం మధ్య బిల్లు పాస్ కాకూడదన్నారని, చర్చ జరిగితీరాలన్నారని, దీన్నిబట్టే కేంద్రం ఏదో కుట్ర పన్నుతున్నట్టు కనిపిస్తోందని నాగం అనుమానం వ్యక్తం చేశారు. లోక్‌సభలో మంత్రులు వెల్‌లోకి వస్తే తక్షణం సస్పెండ్ చేయాలన్నారు. ఇక ముఖ్యమంత్రి చివరి రోజుల్లో అప్పనంగా భూములు ధారాదత్తం చేస్తున్నారని, తెలంగాణ వచ్చాక అవి తిరిగివస్తాయన్నారు.