హరియాణాలో ఫలితాలు ఎందుకిలా తల్లకిందులయ్యాయని ఆలోచిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పదికి పది లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ విజయదుంధుభి మోగించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని... అవే ఫలితాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తాయని అంతా భావించారు. ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలూ ఇదే అంచనాతో ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలో బీజేపీ ఓట్ల శాతం 58. ఇది ఈ అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి 36కు పడిపోయింది. అంటే 22 శాతం ఓట్లని బీజేపీ కోల్పోయింది.
బీజేపీ స్థానిక అంశాలను పక్కనబెట్టి జాతీయాంశాలైన కశ్మీర్ లాంటి సమస్యలను తెరపైకి తేవడం ప్రజలకు అంతగా రుచించలేదని పరిశీలకులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే పరిస్థితి గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిబింబించింది. మరోవంక కాంగ్రెస్ ఓటు శాతం 2014 అసెంబ్లీ ఎన్నికలకంటే 9 శాతం పెరిగి 29 శాతంగా మారితే, జేజేపీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్డీ) ఓటు శాతం 7 శాతం తగ్గింది. బీజేపీ అసెంబ్లీ స్థానాలు తగ్గినప్పటికీ, 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓట్ల శాతం 2 వరకూ పెరిగింది. హరియాణాలో బీజేపీ వ్యతిరేకత ఎంతగా పనిచేసినా జాట్ల ఓట్లు అత్యంత ప్రధానమైనవని భావించకతప్పదు. జాట్ సామ్రాజ్యంలో జాట్‌యేతర ముఖ్యమంత్రిగా ఖట్టర్ వ్యతిరేకతను పోగుచేసుకొని, జాట్ సామాజిక వర్గ ఓట్ల సమీకరణకు అవకాశం ఇచ్చినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment