జాట్లు ఎటువైపు? | Politics of Jats vs non-Jats to be factor in Haryana Assembly polls | Sakshi
Sakshi News home page

జాట్లు ఎటువైపు?

Published Tue, Oct 15 2019 3:28 AM | Last Updated on Tue, Oct 15 2019 3:28 AM

Politics of Jats vs non-Jats to be factor in Haryana Assembly polls - Sakshi

హరియాణాలో 2016లో వెల్లువెత్తిన జాట్‌ రిజర్వేషన్‌ ఉద్యమం యావత్‌ దేశాన్నే ఒక కుదుపు కుదిపేసింది. పంజాబ్, రాజస్తాన్, ఢిల్లీలతో సహా దేశవ్యాప్తంగా 8.2 కోట్ల మంది జాట్‌ సామాజిక వర్గానికి చెందినవారున్నారు. ఒక్క హరియాణాలోనే వీరు 29 శాతం మంది ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అత్యధిక మంది ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. జాట్‌ల ఆధిపత్యంలోని హరియాణాలో తిరిగి పాగావేసేందుకు బీజేపీ ‘‘అబ్‌ కీ బార్‌ సత్తార్‌ పార్‌’ (ఈసారి 70 సీట్లను దాటాలి) అనే నినాదంతో బరిలోకి దిగింది. 18 ఏళ్ల తరువాత తొలిసారి 2014లో జాట్‌యేతర సామాజికవర్గం నుంచి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ అధికారం చేపట్టారు. అయితే రాష్ట్రంలో పాలకుల భవితవ్యాన్ని ఖరారుచేసే ఈ సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో ఎటువైపు నిలుస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఉత్తర హరియాణా...  
2014లో స్థానాలు చండీగఢ్, పంచకుల, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్‌ లలో బీజేపీ అత్యధిక స్థానాలు సా«ధించుకుంది. ఈ ప్రాంతంలో జాట్‌యేతరులదే ఆధిక్యం. బీజేపీ సామాజిక ఎత్తుగడలో భాగంగానే గత ఎన్నికల్లో ఈ ప్రాంతంపై దృష్టిసారించింది. చాలా కాలంగా గుర్తింపునకు నోచుకోని జాట్‌యేతర పంజాబీ భాషమాట్లాడే బనియా సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలన్న కాషాయ పార్టీ ఎత్తుగడ ఫలించింది. ఈసారి సైతం బీజేపీ విజయాన్ని కైవసం చేసుకునేందుకు ఇదే వ్యూహాన్ని ప్రయోగిస్తోంది. మాజీ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ సీఎం ఖట్టర్‌ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడని బీజేపీ ప్రకటించడం అందులో భాగమే.  

జాట్‌ బెల్ట్‌...
‘ఛత్తీస్‌ బిర్‌దారీస్‌’’ (36 సామాజికవర్గాలు) చాలా కాలంగా ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తున్నాయి. హిసార్, భివానీ, మహేంద్రఘర్, రోహతక్, ఝజ్జార్, సోనిపట్, జింద్, కైతాల్‌ ప్రాంతాల్లో జాట్‌ సామాజికవర్గం అధికం. గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న భజన్‌లాల్, భూపేందర్‌ హుడా, ఓం ప్రకాశ్‌ చౌతాలాలు ఇదే ప్రాంతం నుంచి గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. గతఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి పెద్దగా కలిసిరానిమాట వాస్తవం. అంతమాత్రాన ఈసారి జాట్లు బీజేపీకి ఓట్లు వేయరనడం ఒట్టిమాటేనంటున్నాయి బీజేపీ శ్రేణులు. 2014లో రోహతక్, సోనాపేట్, ఝజ్జార్‌లు కాంగ్రెస్‌కి పట్టున్న ప్రాంతాలైనప్పటికీ ఈ ప్రాంతాల్లో ఆ పార్టీ కేవలం 15 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది.  

ఈసారి కాంగ్రెస్, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ స్థానిక పాలనాంశాలను తెరపైకి తెస్తే, బీజేపీ మాత్రం ఖట్టర్‌ క్లీన్‌ రికార్డుపైనా, ప్రధాని మోదీ ఛరిష్మానీ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి. గతంలో కేవలం జాట్లు అధికంగా ఉన్న, హుడా కుటుంబాలకు పెట్టని కోటలైన రోహతక్, సోనాపేట్‌ రెండు జిల్లాలకే విద్య, ఉద్యోగాలు పరిమితమయ్యాయనీ బీజేపీ అంటోంది. ఖత్తార్‌ ప్రభుత్వం దశాబ్దాల అనంతరం అన్ని ప్రాంతాలకూ సమాన ఉద్యోగావకాశాలు కల్పించిందన్నది బీజేపీ వాదన. ఇదే జాట్లు, జాట్‌ యేతర సామాజిక వర్గాల మధ్య విభజనని మరింత స్పష్టంచేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement