జైపూర్: కళ్ల ముందే తన భర్తను కాల్చి చంపారని రాజస్ధాన్‌లోని జైపూర్‌కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ హత్య వెనుక తన తల్లిదండ్రుల హస్తం ఉందని ఆమె ఆరోపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మమత చౌదరి(30), అమిత్ నయ్యర్(28)లు ఏడాదిన్నర క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
సివిల్ ఇంజనీర్ అయిన అమిత్.. జైపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ మమత ఇంటి పక్కనే నివసించేవాడు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో మమత తన ఇంట్లో ప్రేమ విషయం చెప్పి పెద్దలను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే, అమిత్‌ది వేరే కులం కావడంతో మమత తల్లిదండ్రులు వారి వివాహానికి అడ్డుచెప్పారు.
దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మమత, అమిత్‌ను వివాహం చేసుకుని జైపూర్‌లోనే కాపురం పెట్టారు. మమత గర్భవతి అని తెలిసిన ఆమె తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం ఫోన్ చేసి పలకరించారు. బుధవారం మమతను కలిసేందుకు ఇంటికి వచ్చారు. అమిత్ గురించి వాకబు చేశారు. అమిత్‌ను వదిలేసి తమతో వచ్చేయాలంటూ బలవంతపెట్టారు. మమత ప్రతిఘటించడంతో ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి అమిత్‌పై కాల్పులు జరిపారు.
కాల్పుల్లో అమిత్ మెడ, ఛాతీ భాగాల్లో బుల్లెట్ గాయాలు అయ్యాయి. రక్తం ఎక్కువగా పోవడంతో అమిత్ చనిపోయినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. అమిత్‌పై కాల్పుల తర్వాత ఆచూకీ లేకుండా పోయిన మమత తల్లిదండ్రుల కోసం వెతుకులాట కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
'నా భర్తను కళ్ల ముందే కాల్చేశారు'
Published Thu, May 18 2017 10:06 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
Advertisement
Advertisement